జన జీవితాల్ని ప్రభావితం చేసే శక్తి కవులకు ఉంటుంది. వారి కలం నుంచి వచ్చే ప్రతి అక్షరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఎందరో ప్రజలకు అవి ప్రేరణని ఇస్తూంటాయి. ఈ భావుకత సినిమాల్లో పాటలు రాసే వారికి మరింత ఎక్కువగా ఉంటుంది. సినిమా మాధ్యమం ద్వారా ఏం చెప్పినా ప్రజలకు చేరువవుతుంది. ఇదే ఇప్పుడు సినీ గీత రచయిత చంద్రబోస్ చేస్తున్నారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో వ్యవస్థలను, ప్రజలను రక్షించే బాధ్యతను మరింతగా బాధ్యతగా పోషిస్తున్నారు పోలీసులు. దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకూ పోలీసుల కృషిని వేనోళ్ల పొగుడుతున్నారు.

 

 

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ వ్యవస్థలను కాపాడుతున్న పోలీసులపై చాలా చోట్ల దాడులు జరిగాయి. వ్యవస్థలను సమర్ధవంతంగా కాపాడుతున్న పోలీసులపై ఇటువంటి దాడులు చేయడం హేయమైన విషయం. ఎంతో నిబద్ధతతో పని చేస్తున్న వారిపై జరుగుతున్న దాడులను ప్రతి పౌరుడు ఖండించాల్సిన సమయం ఇది. ఈ ఉద్దేశాన్ని అందరికీ అర్ధమయ్యేలా అక్షర రూపం ఇచ్చారు చంద్రబోస్. తన కలానికి ఉన్న పదునెంతో చూపించారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని కొనియాడుతూ ఓ గీతాన్ని రాశారు. రాయడంతో పాటు ఆ గీతాన్ని ఆలపించారు. ఇందులో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా వారికి సంఘీభావంగా ఉండాలని కోరారు.

 

 

ప్రజలు పోలీసులు సూచించిన ప్రకారం నడుచుకోవాలని ఆయన కోరారు. తాను ఆలపించిన పాటను చంద్రబోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాటకు నెటిజన్ల నుంచి విశేష ప్రాముఖ్యం లభించింది. మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్రబోస్ రాసి, ఆలపించిన గీతాన్ని కొనియాడుతూ మెచ్చుకున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా ఈ సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. నిద్రాహారాలు మాని ప్రజల కోసం పాటుపడుతున్న పోలీసు వ్యవస్థకు అందరూ కృతజ్ఞతగా ఉండాల్సిన సమయమిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: