రవితేజ సినిమా కెరీర్ ని పూర్తిగా మార్చేసిన విక్రమార్కుడు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం లో రవితేజ అత్తిలి సత్తి అనే ఒక దొంగ గాను, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాను రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి విమర్శకుల చేత కూడా మెచ్చుకోబడ్డాడు. మధ్యప్రదేశ్ లోని చంబల్ ప్రాంతంలో అమాయక ప్రజలపై రాక్షసత్వం చూపిస్తున్న బావూజీ, తన తమ్ముడు టిట్లా భాయ్ లకు నిద్ర పట్టకుండా విక్రమ్ సింగ్ రాథోడ్ చేస్తే... అత్తిలి సత్తి వారిని అంతమోదిస్తాడు. విలన్ పాత్రలో గగుర్పాటు కల్పించేలా నటించిన అజయ్ కు కూడా ఎనలేని పాపులారిటీ వచ్చింది.


రవితేజ సరసన అనుష్క శెట్టి నటించగా... వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. 'జుంజుం మాయ జుంజుం మాయ,
ప్రేమిస్తేనే ఇంతటి హాయా' అనే సాంగ్ ఎంత గా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జింతాతా అని రవితేజ బల్లమీద చేతులతో ఒక వినసొంపు శబ్దం తెలుగు రాష్ట్రాలలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాగా కొనసాగే విక్రమార్కుడు లో డిసిపి పాత్రలో నటించిన ప్రకాశ్ రాజ్ కు, విక్రమ్ సింగ్ రాథోడ్ కు మధ్య ఒక సన్నివేశం రోమాలు నిక్క పొడిచే లా ఉంటుంది. ఈ సన్నివేశంలో రవితేజ చెప్పే ఒక డైలాగ్ ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఉంటుంది.


"నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు, సర్. ఎప్పుడో ఒకసారి కాదు రోజుల్లో ప్రతిక్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను, సర్. నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధినిర్వహణలో ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను, సర్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్లు, ఫోన్ కాల్స్ రావొచ్చు రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నా చావు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆరోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం... ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం బాధపడుతూనే ఉంటాను, సర్' అంటూ సూపర్ సిన్సియర్గా రవితేజ చెప్పిన డైలాగు విన్న ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి పోలీస్ వ్యవస్థ లో చేరారట. "చావంటే భయపడడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా?! రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్' అంటూ చెప్పిన డైలాగ్ కూడా గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాని పోలీస్ కావాలనుకునే వారు, డ్యూటీ చేస్తున్న పోలీసులు కూడా చూస్తే బాగుంటుంది. ఏదేమైనా రవితేజ సినీ కెరీర్ లో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర మర్చిపోలేనిది అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: