సినీ ఇండస్ట్రీని ఒక దయ జాలి లేని లోకం గా పేర్కొనవచ్చు. స్టార్డం ఉన్నంతవరకూ సినీ ఇండస్ట్రీలో అందరూ నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతుంటారు. కానీ ఒక్కసారి ఆ స్టార్ డం, పాపులారిటీ పూర్తిగా తగ్గిపోతే నటీనటుల జీవితాలు అత్యంత దారుణంగా మారిపోతాయి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన ఎంతో మంది ప్రముఖులు తమ చివరి దశలో ఎలాంటి పరిస్థితులను అనుభవించి చనిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటివారిలో హాస్యనటుడు ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. ఇతను మొదటిలో సినిమా ముహూర్తాలకు పౌరోహిత్యం చేసేవారు. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ అప్పుల అప్పారావు సినిమా ద్వారా శాస్త్రిని హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రి హాస్య భరితమైన సినిమాల్లో చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. లింగబాబు లవ్ స్టోరీ, రాజేంద్రుడు గజేంద్రుడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, బద్రి ఆయనకిద్దరు, ఆలీబాబా అరడజను దొంగలు, ఆవిడ మా ఆవిడే, తమ్ముడు, జంబలకడిపంబ పేకాట పాపారావు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి కామెడీ పండించి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.


బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ లో తెరకెక్కించిన సన్నివేశాలు అప్పట్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారాయంటే అతిశయోక్తి కాదు. హలో అల్లుడు చిత్రంలో బాబు మోహన్ ఐరన్ లెగ్ శాస్త్రి ఒక అమ్మాయికి సైట్ కొట్టే సన్నివేశం ఇప్పటి తరాన్ని కూడా నవ్విస్తుంది. బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ తరువాత ఎక్కువ పాపులారిటీ కలిగిన ఐరన్ లెగ్ శాస్త్రి వారందరి లాగా మంచి జీవితాన్ని అనుభవించలేక పోయారు. దీనికి కారణం తాను లావు ఎక్కువగా ఉండటమేనని చెప్పుకోవచ్చు. అప్పట్లో తన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోవడంతో... అనారోగ్యం క్షీణించి హృదయ సంబంధిత రుగ్మతలు తలెత్తేవి. అనారోగ్యంగా ఉండటంతో తనకు సినిమా అవకాశాలు సన్నగిల్లి పోయాయి. నటించినంత కాలం కాస్తోకూస్తో సంపాదించిన ఐరన్ లెగ్ శాస్త్రి... సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా కృంగిపోయాడు. ఒకవైపు అనారోగ్య సమస్యలు బతికుండగానే నరకం చూపిస్తుంటే... మరోవైపు ఆర్థిక సమస్యలు అతడిని మానసికంగా కృంగదీసాయి. చివరికి చాలా దయనీయమైన పరిస్థితిలో తాను తనువు చాలించాడు.


గతంలో ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడైన ప్రసాద్ తన తండ్రి గురించి కంటతడి పెట్టించే విషయాలను తెలియజేశాడు. మీ నాన్న ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మీకు అని ప్రశ్నిస్తే... తమకు తాడేపల్లిగూడెంలో ఒక సొంత ఇల్లు తప్ప మరే ఇతర ఆస్తులు లేవని చెప్పుకొచ్చాడు. తమ సొంత ఇంటిలోనే తన తండ్రికి గుండెపోటు వచ్చిందని... ఆ విషయం తన అత్తయ్య( ఐరన్ లెగ్ సోదరి)కు తెలియడంతో ఆమె తన భర్త సహాయం తో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించిందని... కానీ ఆ ఆసుపత్రి వైద్యులు ఐరన్ లెగ్ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉందని తమ వల్ల కాదని... పెద్ద ఆసుపత్రికి తీసుకు వెళ్లవలసిందిగా సూచించారని ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దాంతో తాడేపల్లిగూడెం కి కొంత దూరంలో ఉన్న మదర్ వన్నిని ఆసుపత్రికి ఐరన్ లెగ్ శాస్త్రి ని తాము తరలించామని... అక్కడ ఒక వైద్యుడు శాస్త్రి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఈయన ఒక రోజు కంటే ఎక్కువ కాలం బ్రతకలేడని తెలిపారని శాస్త్రి కుమారుడు చెప్పుకొచ్చాడు.


ఈ విషయం తెలుసుకున్న తాను ఆస్పత్రికి వచ్చేందుకు రైలు ప్రయాణం చేస్తున్న సమయం లోనే తన నాన్న చనిపోయారని... తను ట్రైన్ దిగి ఇంటికి వెళ్తున్న మార్గంలోనే తన తండ్రి శవం ఎదురైందని తన చెప్పుకొచ్చాడు. తన తండ్రి అయిన ఐరన్ లెగ్ శాస్త్రి శవాన్ని కొంతమంది ఒక రిక్షా పై ఈడ్చుకుంటూ వస్తున్నారని... అప్పుడు తన తండ్రి తల కిందకి వేలాడుతుందని... కాళ్లు రోడ్డు ని తాకుతున్నాయని... రాళ్ళు రప్పలు మట్టి కారణంగా తన తండ్రి పాదాల చర్మం ఊడిపోతుందని... ఆ విధంగా తన తండ్రిని ఈడ్చుకెళ్తుంటే చూడలేకపోయానని ప్రసాద్ చెప్పుకొచ్చాడు. జూన్ 19 2006 వ సంవత్సరంలో చనిపోయిన ఐరన్ లెగ్ శాస్త్రి 44 ఏళ్లు ఉన్నాయి. ఏది ఏమైనా ఐరన్ లెగ్ శాస్త్రి మరణం అందరిని కలిచి వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: