దివ్య భారతి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. దివ్య‌భార‌తి సినీ రంగ ప్ర‌వేశం ఓ సంచ‌ల‌నం. ఈమె మొద‌టి సినిమా బొబ్బిలి రాజా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. అచ్చం శ్రీ‌దేవి రూపురేఖ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది దివ్య‌భార‌తి. చిన్నతనంలోనే అగ్ర హీరోయిన్లకు ధీటుగా క్రేజ్‌ను సంపాదించుకొన్నది. తెలుగు, తమిళ, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. నాగార్జున‌తో త‌ప్ప చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌.. ఇలా టాప్ హీరోల ప‌క్క‌న న‌టించి త‌న స‌త్తా చాటింది. 

 

అప్పట్లో దివ్యభారతి జోరు ఏ రేంజిలో ఉండేదంటే.. ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్ల కాలంలో ఆమె దాదాపు 13 సినిమాల్లో నటించారు. చేసిన ప్రతీ సినిమా హిట్ కావడంతో రోజుకు రూ. లక్ష పారితోషకం తీసుకునే బాలీవుడ్ హీరోయిన్ లిస్ట్‌లో ఒకరిగా దివ్య భారతి చేరారు. వరుస సినిమాలతో అప్పట్లో ఆమె పేరు మారుమ్రోగి పోయింది. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా దివ్యభారతి 1993లో అకాలమరణం పొందారు. బాల్కనీ నుండి కింద పడిపోయి అనుమానాస్పదంగా మరణించ‌డంతో.. ఆమె మరణం ఒక మిస్టరీగా మారింది.

 

అయితే కెరీర్ ఫీక్స్‌లో ఉన్న‌ప్పుడు దివ్య భార‌తి జీవితంలోకి ప్రేమ అనే రెండు అక్షరాలు వచ్చి చేరాయి. ఇది ఆమె అంతానికి దారి తీసిందనే వార్త‌లు  కూడా వ‌చ్చాయి. దివ్య భారతి గోవిందతో నటిస్తున్న షోలా ఔర్ బదనామ్ సినిమా షూటింగ్‌కి గోవిందంని కలుసుకునేందుకు షాజిద్ నడియాద్వాల వస్తుండేవాడు. ఇలా గోవిందతో మాట్లాడేందుకు వచ్చిన షాజిద్ మాటల్లో మాట దివ్య భారతితో కలిపేవాడు. ఇలా కొన్ని రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. దివ్య భారతి తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం సజిద్ నడియాద్వాలతో చిన్న వయసులోనే ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది. 

 

ఈ క్ర‌మంలోనే మతం మార్చుకుని `సన` అన్న పేరును కూడా పెట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత కొన్ని రోజులకు బాల్కనీలో కూర్చున్న దివ్యభారతి  అదుపుతప్పి కిందపడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బలు తగిలి మృతి చెందింది దివ్య భార‌తి. దీంతో ఆమె మ‌ర‌ణం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆమెను ఎవ‌రో హ‌త్య‌చేసి పై నుంచి ప‌డేశార‌ని కొంత మంది, తాగిన మైకంలో జారిప‌డి చ‌నిపోయింద‌ని కొంత మంది అన్నారు. ఇక‌, ఆమె తండ్రి ఓంభారతి.. దివ్య భార‌తి ప్ర‌మాద‌వ‌శాత్తు బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డిపోయి మ‌ర‌ణించింద‌ని వెల్ల‌డించారు. కానీ, ఇప్ప‌టికీ ఆమె మ‌ర‌ణం మిస్ట‌రీ అనే చెప్పుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: