టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరోగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో తనకంటూ ప్రేక్షకులలో, ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ, ముందుగా అల్లరి రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నువ్విలా సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నాగ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు గడించిన విజయ్, అనంతరం తన మిత్రుడు తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారడం జరిగింది. పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టడంతోపాటు ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం కూడా సూపర్ హిట్స్ అందుకున్న విజయ్, ఆ తరువాత స్టార్ హీరోగా పలు అవకాశాలతో దూసుకెళ్లాడు. 

 

అయితే ఇటీవల మాత్రం కొంత ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్న విజయ్, ప్రస్తుతం పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ తో మళ్ళి ఫామ్ లోకి వస్తానని అంటున్నాడు. ఇకపొతే ప్రస్తుతం కరోనా వ్యాధి వలన దేశం మొత్తం లాక్ డౌన్ అమలవుతుండడంతో మిగతా ఇతర హీరోల మాదిరిగా విజయ్ కూడా తనవంతుగా ముందుకు వచ్చి రూ.1.30 కోట్ల విరాళంతో పాటు ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి మరికొంత విరాళాలు సేకరిస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాడు. అయితే అతడి ఫౌండేషన్ సేకరిస్తున్న విరాళాలు, పెడుతున్న ఖర్చులు విషయమై కొంత తప్పుగా రాతలు రాసిన ఒక మీడియా వెబ్ సైట్ పై నిన్న అసహనం వ్యక్తం చేస్తూ విజయ్ ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ విధంగా తప్పుడు రాతలు రాయడం వలన విరాళం ఇవ్వాలని భావించేవారు కూడా కొంత ఆలోచనలో పడి ఇవ్వలేరని, తద్వారా ఎందరో తిండి లేక అల్లాడుతారని, అందువలన దయచేసి మీ డబ్బుల కోసం ఈ విధమైన తప్పు వార్తలు రాయవద్దని విజయ్ కోరడం జరిగింది. 

 

అయితే అలా విజయ్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా స్పందిస్తూ, నీకు నేనున్నాను ఈ విషయమై గొంతెత్తి పోరాడుతాం అంటూ ఒక పోస్ట్ చేయగా, ఆపై చిరంజీవి, అల్లరి నరేష్, రవితేజ, కాసేపటి క్రితం నాగార్జున, కార్తికేయ, సహా టాలీవుడ్ ఇండస్ట్రీ లోని దాదాపుగా అన్ని నిర్మాణ సంస్థలు, దర్శకులు కూడా విజయ్ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ రీట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంతో ఇండస్ట్రీ మొత్తం కూడా విజయ్ కి సపోర్ట్ చేస్తుండడంతో పాటు కొన్ని వెబ్ సైట్స్ రాస్తున్న తప్పుడు వార్తల పై నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: