హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ స‌రికొత్త రికార్డ్ సృష్టించ‌నున్నాడు. ఎలాంటి డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్లు చేసే అతి కొద్దిమంది హీరోల్లో హాలీవుడ్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ ఒకరు. ఆయన 'మిషన్‌ ఇంపాసిబుల్‌' సిరీస్‌ చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే. అతి పెద్ద కట్టడమైన బుర్జ్‌ ఖలీఫాను అమాంతం ఎక్కేశారు. ఇప్పుడు మరో పెద్ద సాహసానికి సిద్ధమవుతున్నారట టామ్‌. ఇందుకోసం టామ్ క్రూజ్... ఎలోన్ మస్క్ సంస్థ చేతులు కలిపాయి. మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం నాసా సహకారంతో ఈ అద్భుతం జ‌ర‌గ‌నుంది. హాలీవుడ్ చరిత్రలో దీనిని మ‌రో విప్లవంలా భావిస్తున్నారు. టామ్ క్రూజ్ న‌టించబోయే ఈ చిత్రం భూమి బ‌య‌ట‌ చిత్రీకరించిన మొదటి చిత్రంగా నిలుస్తుంది. ఇది యాక్షన్ చిత్రంగా రూపొంద‌నుంది. అయితే ఇది మిషన్ ఇంపాజిబుల్‌ లో భాగం కాదని నిర్మాత‌లు స్ప‌ష్టం చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికావాల్సివుంది. అయితే నాసాసినిమా గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

 

అంతరిక్షంలో సినిమా చేయాలన్న ఆలోచన టామ్‌కు ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2018లో దీనిపై ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ కూడా మాట్లాడారు. ‘‘టామ్‌ క్రూజ్‌తో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేయాలని 15 ఏళ్ల కిందటే చర్చించా. 2000 సంవత్సరంలో రష్యన్‌లతో నాకు ఒక ఒప్పందం కుదిరింది. వారి సాయంతో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లి హై-ఎండ్‌ త్రీడి డ్యాకుమెంటరీ తీయాల్సి ఉంది. ‘టామ్‌, నువ్వు నేనూ సూయీజ్‌లో అంతరిక్షానికి వెళ్లి సినిమా షూట్‌ చేసుకుని వద్దాం. అయితే, మనకు ఇంజినీరింగ్‌లో ఎవరైనా శిక్షణ ఇస్తే బాగుంటుంది’ అని అన్నాను. అప్పుడు టామ్‌ ‘నేను ఇంజినీరింగ్‌ శిక్షణ తీసుకుంటా’ అని అన్నాడు. కథ విషయంలో మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే, అది ఇప్పటికీ కాన్సెప్ట్‌గానే ఉంది’’ అని అన్నారు. ఇప్పుడు టామ్‌ నాసా, స్పేస్‌ ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడటంతో ఈ టాపిక్‌ కాస్తా హాట్‌ టాపిక్‌ అయింది. మరి త్వరలోనే అంతరిక్షంలో నిజంగా షూటింగ్‌ ఉంటుందా.. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అది సాధ్యమే కావచ్చు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: