లాక్డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగులు ఆగిపోయాయి. నెలలు గడుస్తున్నా కరోనా ఉధృతి ఇంకా తగ్గడం లేదు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చిన్న సినిమా నిర్మాతలు కుదేలైపోతున్నారు. సినిమా కోసం చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయి.

 

దాంతో నిర్మాతలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియట్లేదు. కరోనా కారణంగా మరో రెండు మూడు నెలల వరకూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. దాంతో చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాల ఓటీటీల ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

 

తెలుగులోనే హిందీ సహా అన్ని భాషల్లోనూ ఇదే పద్దతిని అవలంబించడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ సూర్య కూడా తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. సూర్య భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్ మగల్ వంధాల్ అనే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తుంటే, తమిళనాడు థియేటర్ల సంఘం అడ్డు పడింది.

 

థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మించిన సినిమాలని డైరెక్టుగా ఆన్ లైన్లో ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నలు వేసింది. ఒకవేళ థియేటర్ల మాట కాదని సినిమాని ఆన్ లైన్లో రిలీజ్ చేస్తే రాబోయే సూర్య చిత్రాలని థియేటర్లలో ఆడనివ్వమని వార్నింగ్ ఇచ్చింది. అయితే సూర్య ఈ వార్నింగ్స్ కి భయపడకుండా పొన్ మగల్ వంధాల్ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికే సిద్ధం అవుతున్నాడని టాక్.. మరి సూర్య మొండి పట్టుదల ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: