రాజమౌళి ఒకటి అనుకుంటే ప్రేక్షకులు మరొకటి ఆలోచిస్తున్నారు. దర్శకధీరుడికే ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు చాలామంది. ఎప్పటికైనా ఒక సినిమా తీస్తానని.. అది తన డ్రీమ్ రోల్ అని జక్కన్న చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ దర్శకుడి నుంచి మరొకటి ఆశిస్తున్నారు. 

 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాలను రాజమౌళి టీజర్.. ట్రైలర్ గా ఉపయోగించుకుంటున్నాడు. ఆయన డ్రీమ్ మాత్రం మహాభారతం.  ఈ సినిమా తీసేందుకు ఇంకా టైమ్ ఉందనీ.. దర్శకుడిగా అనుభవం సరిపోదని.. ఎప్పటికైనా మహాభారతం తీస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు రాజమౌళి. 

 

మహాభారతం తీయడం రాజమౌళి టార్గెట్ అయితే.. ప్రేక్షకులు మాత్రం రామాయణం అడుగుతున్నారు. రామాయణం మహాకావ్యాన్ని 1987లో ధారావాహికగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు రామానంద సాగర్. ఈ సీరియల్ ను  ప్రేక్షకుల కోరిక మేరకు  లాక్ డౌన్ కారణంగా తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా రాజమౌళి సర్.. రామాయణం తీయండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

 

రాజమౌళి రామాయణం తీయండని నెటిజన్లు చేస్తున్న వరుస ట్వీట్లతో రాజమౌళిమేక్ రామాయన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ఇండియా  ట్రెండింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. రాముడిగా ఎన్టీఆర్ ను చూడాలనుకుంటున్నట్టు కొందరు ట్వీట్ చేశారు. అయితే దీనిపై రాజమౌళి ఇంతవరకు స్పందించలేదు. 


రాజమౌళికి కథల్లో ఎమోషన్స్.. యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయి. హీరోయిజం.. విలనిజమన్నా.. పతాక స్థాయిలో చూపిస్తాడు. ఇవన్నీ రామాయణంలో కంటే.. మహాభారతంలో పుష్కలంగా ఉంటాయి. అందుకే జక్కన్న దృష్టి భారతంపై పడి.. ఎప్పటికైనా మహాభారతం తీస్తానన్నాడు. మరి రాజమౌళి దర్శకత్వంలో రామాయణం చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కోరిక దర్శకుడు మన్నిస్తాడో లేదో చూడాలి. మొత్తానికి ప్రేక్షకుల మదిలో ఏముందో దర్శక ధీరుడు రాజమౌళికి తెలిసిపోయింది. ఆయన నుంచి అనుకున్నది జరిగితే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: