మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కిక్కిచ్చే సినిమాల్లో 'కిక్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కి కేరాఫ్ అడ్రస్ గా నిల‌చిన రవితేజ 'కిక్' సినిమాతో తనలోని మరో కామెడీ యాంగిల్ చూపించాడు. వినోదానికే పెద్ద పీట వేస్తూ వస్తున్న ర‌వితేజ ఎంటర్‌టైన్మెంట్ డోస్ పెంచి ప్రేక్షకులకు కిక్కెక్కించాడు. నలుగురికి మంచి చేయడంలో ఉండే కిక్... మ‌రెందులోనూ ఉండ‌దనే ఇతివృత్తంతో ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ర‌వితేజ‌కి జోడీగా గోవా బ్యూటీ ఇలియానా నటించిన‌ ఈ చిత్రంలో షాయాజీ షిండే, ప్రభ, బ్రహ్మానందం, శ్యామ్, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, అలీ, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేష ఆద‌ర‌ణ పొందాయి. అచ్చిరెడ్డి సమర్పించిన ఈ సినిమాని ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రసూర్ ఎల్లోర్ కెమెరామెన్ గా వ్యవహరించారు. రవితేజ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'కిక్‌' 2009 మే 8న విడుదలై… నేటితో పదకొండేళ్ళు పూర్తి చేసుకుంది.

 

IHG

 

రవితేజ - ఇలియానా జంటగా న‌టించిన‌ రెండో చిత్రం ‘కిక్’. అంతకుముందు వీరిద్దరూ ‘ఖతర్నాక్’ సినిమాలో అల‌రించారు. అలాగే ‘కిక్’ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాల్లో జోడీ క‌ట్టారు. అంతేకాకుండా రవితేజ - దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన తొలి చిత్రమిది. ఆ త‌రువాత వీరి కాంబినేషన్‌లో ‘కిక్’కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందింది. సంగీత దర్శకుడిగా తమన్‌కు లైఫ్ ఇచ్చిన సినిమా ‘కిక్' అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. రవితేజ - తమన్ కాంబినేషన్‌లో ‘మిరపకాయ్’, ‘బలుపు’, 'పవర్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న క్రాక్ సినిమాకి కూడా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజ 'కిక్' చిత్రాన్ని తమిళంలో ‘జయం’ రవి హీరోగా ‘తిల్లాలంగడి’ పేరుతోనూ, కన్నడంలో ఉపేంద్ర హీరోగా ‘సూపర్ రంగ’ పేరుతోనూ రీమేక్ చేసారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిక్’ పేరుతోనే రీమేక్ చేయడం విశేషం. అంతేకాదు ఈ మూడు భాష‌ల్లోనూ ఈ సినిమా విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: