మిళమిళ మెరిసిన తారలు ఇపుడు మిణుకుమిణుకుమంటున్నారు. కారణం అక్కడ ఆకాశం వెలసిపోవడమే. లాక్ డౌన్ కారణంగా గత నెలన్నర రోజులుగా ఇంటిపట్టునే ఉంటున్న సినిమా నటులకు ఏమీ తోచడంలేదు. షూటింగుల పేరుతో నెలలో ముప్పయి రోజులూ ఈ దేశం, ఆ దేశం పట్టి తిరిగే వారికి ఇన్ని రోజులు ఒకే చోట ఉండిపోవడం అంటే కష్టమైన పనే.

 

అంతే కాదు, ఇంట్లో ఉంటూ టైం పాస్ చేయమంటే అంతకు మించిన శిక్ష లేదేమో. ఇది అందరి విషయంలో కాకపోయినా చాలా మంది మాత్రం బోర్ ఫీల్ అవుతున్నారట. లాక్ డౌన్ పొడిగింపే తప్ప రిలీఫ్ ఇప్పట్లో కనిపించడంలేదు. దాంతో ఏం చేయాలో అన్నీ చేశారు. ఇంట్లో దోసెలు వేశారు, మొక్కలకు నీళ్లు పోశారు.


 
ఇంకా తమ హిడెన్ టాలెంట్ ఏమైనా  ఉంటే చూపించారు. ఇపుడు అన్నీ అయిపోయినట్లుగా ఫ్లాష్ బ్యాక్ అంటున్నారు. అంటే పాత రోజులను నెమరువేసుకుంటున్నారన్నమాట. టీవీల్లో పాత సీరియళ్ళు చూపిస్తుండగా లేనిది కొన్నాళ్ళ క్రితం జరిగిన విషయాలను మళ్ళీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటే తప్పేంటి.


 
ఇప్పటికే జగదేక వీరుడు అతిలోక సుందరి మూడు దశాబ్దాల సంబరానికి ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తెరతీశారు. ఆ సినిమా ఎలా తీశాం, నాటి కష్టాలు ఏంటి, హిట్ కావడానికి ఎవరెవరి పాత్ర ఎంత అన్నది కూడా వివరిస్తూ నాని వాయిస్ ఓవర్ తో ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఫ్యాన్స్ కి అందిస్తున్నారు.


 
ఇక ఇపుడు మరో హీరో ప్రభాస్ అయితే ఎపుడో షూటింగ్ ప్రారంభం అయిన తన 20వ చిత్రం తాలూకా  స్టిల్స్ ని లేటెస్ట్ గా యూనిట్ ద్వారా విడుదల చేయించాడు. నిజానికి అప్పట్లో అయితే విడుదల చేయలేదుట. మరి నాడు ఎందుకు చేయలేదో కానీ ఇపుడు  ఓపెనింగ్ స్టిల్స్ చూస్తే ఫ్యాన్స్ కి కొత్త జోష్ వస్తోంది.


 
మొత్తం మీద ఫ్లాష్ బ్యాక్ కి సినిమాల్లో ఎపుడూ విలువ ఉంటుంది. జీవితంలో కూడా నిన్నటి రోజులే బాగుంటాయి. మరి రీల్ లైఫ్, రియల్ లైఫ్ కలబోసుకున్న సినిమా నటులకు ఫ్లాష్ బ్యాక్ వాల్యూ వేరే చెప్పాలా. అందుకే రీళ్ళ మాదిరిగా ఏళ్ళకు ఏళ్ళను గిరగిరా వెనక్కి తిప్పేస్తున్నారు.  మరెంతమంది ఈ విధంగా పాత విషయాలు పంచుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: