లాక్ డౌన్ కొనసాగుతూ ఉన్నా అన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో ముందుగా సినిమా షూటింగ్ ల ప్రారంభానికి ఆ తరువాత చిన్న గ్యాప్ ఇచ్చి ధియేటర్స్ పునఃప్రారంభం చేయడానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా ప్రభుత్వ పెద్దలతో రాయబారాలు చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరుకు ఉండే పరిస్థితులను బట్టి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే జూన్ నెల నుంచి షూటింగ్ లు జూలై నుండి ధియేటర్లు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి అంటూ లీకులు వస్తున్నాయి. 


అయితే ధియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ముందుగా పెద్ద హీరోల సినిమాలు సినిమాలు విడుదల చేయకుండా చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు భారీ పబ్లిసిటీతో విడుదల చేసి అసలు జనం ధియేటర్లకు వస్తారా?రారా అన్నపరీక్ష తమకు తామే పెట్టుకోవాలి అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోని ప్రముఖులు భావిస్తున్నట్లు టాక్. గత పరిస్థితికి భిన్నంగా చిత్ర పరిశ్రమ తిరిగి రొటీన్ లో పడటానికి చిన్న సినిమాలకు అన్ని మంచి ధియేటర్లు కేటాయించడానికి ప్రతి ధియేటర్ లోను ప్రేక్షకుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా సీట్స్ విషయంలోచిన్న మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. 


ఈ ప్రయోగం సక్సస్ అయితే ఆ తరువాత మీడియం రేంజ్ సినిమాలు ఆ తరువాత అన్నీ అనుకూలిస్తే దసరా పండుగ సమయానికి పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు థియేటర్లని ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా తక్కువ అద్దెలకు ఇవ్వడానికి ఎగ్జిబ్యూటర్స్ సహకరించబోతున్న పరిస్థితులలో మొదట్లో కేవలం వారానికి ఒక సినిమా మాత్రమే విడుదల అయ్యేలా ఒక యాక్షన్ ప్లాన్ నిర్మాతల మండలి ఆలోచిస్తోంది అన్న మాటలు వినపడుతున్నాయి.


ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెడితే ఇండస్ట్రీ కోలుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుంది అని అభిప్రాయ పడుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన వార్తలు బయటకు లీక్ ఆవడంతో మహాభారత యుద్ధంలో భీష్ముడుని వధించడానికి శిఖండిని అడ్డు పెట్టుకున్నట్లుగా టాప్ హీరోలు తమ సినిమాలను బతికించుకోవడానికి చిన్న సినిమాలను చిన్న హీరోలను అడ్డుపెట్టుకుని రాబోతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: