అక్ష‌రాల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి గుండెల‌కత్తుకుంటాడు ఆయ‌న‌..! ఎలాంటి భావాన్ని అయినా అక్ష‌రీక‌రించి అంద‌మైన పాట‌గా మలిచి మ‌న మ‌దిపై చెర‌గ‌ని ముద్ర‌వేస్తాడు..! అందుకేనేమో.. ఆయ‌న పాట‌లో ఆడంబ‌రం క‌నిపించ‌దు..!  అందుకేనేమో ఆయ‌న పాటలో కొండ‌ల్ని సైతం పిండిచేయ‌గ‌ల‌ ఆత్మ‌స్థైర్యం తొణికిస‌లాడుతోంది..! అందుకేనేమో.. ఆయ‌న పాట మ‌న‌సుభారాన్ని దూరం చేసే మందుగా ప‌నిచేస్తుంది..! అందుకేనేమో ఆయ‌న పాట‌లో ప‌ద‌పొందిక మ‌న‌ల్ని గిలిగింత‌లు పెట్టిస్తుంది..! వేటూరి, సీతారామ‌శాస్త్రి త‌దిత‌ర ఉద్దండుల మ‌ధ్య గెలిచి అక్ష‌ర సైనికుడిగా నిలిచాడు! ఆయ‌నే ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత చంద్ర‌బోస్‌! ఈ రోజు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం మీ కోసం..! అంద‌రిలాగే మొద‌ట్లో చంద్ర‌బోస్ అనేక అవ‌మానాలు, అవ‌హేళ‌న‌కు గుర‌య్యాడు. అయినా ఎక్క‌డ కూడా వెన‌క్కి అడుగు వేయ‌లేదు. ఆత్మ‌స్థైర్యంతో ముందుకు వెళ్లాడు. తాను అనుకున్న‌ది సాధించి మౌనంగానే ఎదిగాడు చంద్ర‌బోస్‌..!

 

చంద్ర‌బోస్ స్వ‌గ్రామం వరంగల్‌ జిల్లాలోని చిన్న గరిగ అనే చిన్న పల్లెటూరు. తండ్రి నరసయ్య, తల్లి మదనమ్మ. మే 10న జన్మించిన చంద్రబోస్‌తో సహా నరసయ్య దంపతులకు నలుగురు పిల్లలు. ప్రాధమిక పాఠశాలలో పనిచేసే నరసయ్య తెచ్చే ఆదాయం చాలక కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపొతే... తల్లి మదనమ్మ కూడా కూలీపనికి వెళ్లి ఆస‌రాగా నిలిచింది. ఇలా ఓపక్క కష్టాలు పడుతూనే...హైదరాబాద్‌లోని జవహర్లాల్‌ నెహ్రు టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో ఎలక్టాన్రిక్స్‌లో ఇంజనీరింగ్‌ చేశాడు చంద్రబోస్‌. నిజానికి.. పాటల రచయితకన్నా ముందుగా నేపథ్య గాయకుడిగా సినిమాల్లో అవకాశం కోసం ప్ర‌య‌త్నాలు సాగించాడు.  అందుకోసం...దూరదర్శన్‌లో సైతం పాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే శ్రీనాధ్‌ అనే స్నేహితుడు పాటల రచయితగా ప్రయత్నించమని సూచించాడు. 

 

ఆ స్నేహితుడు ఇచ్చిన స‌ల‌హాతో చంద్ర‌బోస్ వంద‌శాతం ప్ర‌య‌త్నం చేశారు. 1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘తాజ్‌ మహల్‌’ చిత్రం కోసం శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో ‘‘మంచు కొండల్లోని చంద్రమా!’’.. అన్న పాటతో చంద్రబోస్‌ సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ పాట సూపర్‌ హిట్‌ కావడంతో అప్పటి నుంచి చంద్రబోస్ ఎనాడూ వెనుదిరిగి చూడ‌లేదు. దాదాపుగా అగ్ర‌ద‌ర్శ‌కులంద‌రితో క‌లిసి ప‌నిచేశారు. చిరంజీవి, వేంకటేశ, నాగార్జున, పవన్‌ కళ్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్, రవితేజ, మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్‌ చరణ్‌ తేజ...ఇలా ఎంతో మందికి పాటలు రాసారు. తొలినాళ్లలో చిరంజీవి చిత్రాలు ‘మాస్టర్‌’, ‘చూడాలని ఉంది’, ‘బావగారు బాగున్నారా’?, ‘ఇద్దరు మిత్రులు’, ‘ఠాగూô’, ‘అందరివాడు’, ‘జై చిరంజీవ’ ఇలా అనేక సినిమాలకు పాట‌లు రాసి మెప్పించారు చంద్ర‌బోస్. అంతేగాకుండా.. రామ్‌ చరణ్‌ తేజ ‘మగధీర’, ‘రంగస్థలం’ చిత్రాల్లోని పాటలు ఎంతటి హిట్టో చెప్పాల్సిన పని లేదు.

 

చంద్రబోస్ రాసిన పాట‌ల్లో ఇవి త‌రాల‌కు అతీతంగా నిలిచి ఉంటాయ‌ని చెప్పొచ్చు. మహేష్‌ బాబు ‘1 నేనొక్కడినే’...చిత్రంలో సాయినార...సాయినార, నాగార్జున ‘డమరుకం’లో లాలీ, లాలీ.. జో లాలి, జూనియర్‌ ఎన్ఠీఆర్‌ ‘ఆది’ సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ‘షిర్డీ సాయి’ చిత్రంలో సాయి అంటే తల్లి, ‘గబ్బర్‌ సింగ్‌’లో ఆకాశం అమ్మాయి అయితే, ‘జుమ్మంది నాదంలో దేశమంటే మతం కాదు, ‘బాలు’ చిత్రంలో ఇంతే ఇంతింతే..., ‘జై చిరంజీవ’ చిత్రంలో జై గణేశా..., ‘నాకు నీవు - నీకు నేను’ చిత్రంలో తెలుగు భాష తీయదనం, ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’లో ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి...లాంటి పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూనే ఉన్నారు. ‘సాంబా’లో నమస్తే, నమస్తే నీకు నమస్తే..., ‘మగధీర’లో పంచదార బొమ్మ, ‘నేనున్నాను’లో చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..., ‘నాని’ సినిమాలో పెదవే పలికే మాటలో తీయని మాటే అమ్మ, ‘పల్లకిలో పెళ్లికూతురు’లో చీరలో గొప్పతనం తెలుసుకో..., ‘మృగరాజు’లో చాయ్‌ చటుక్కున తాగారా భాయ్, ‘రంగస్థలం’లో ఈ సేతితోనే...పాటలు జనాదరణ పొందాయి. ఈ పాట‌లు తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశాయి. 

 

చంద్రబోస్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సుచిత్రను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు‌. చంద్రబోస్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురి పేరు అమృత వర్షిణి, కొడుకు పేరు నంద వనమాలి. 2002లో ‘పెళ్లి సందడి’ చిత్రానికి రాసిన పాటలకు గాను ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుని అందుకున్నారు చంద్ర‌బోస్‌. 2004లో ‘ఆది’ సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది పాటకు, అదే సంవత్సరం ‘నేనున్నాను’ చిత్రంలో చీకటితో వెలుగే చెప్పెను పాటకు నంది అవార్డులు అందుకున్నారు. 2014లో ‘మనం’ చిత్రంలో కనిపించిన మా అమ్మకు...అనే పాటకుగాను ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు చంద్ర‌బోస్‌. ఇంకా ఇంకా అనేక సంస్థల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారుచంద్ర‌బోస్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: