ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ స్క్రీన్ పై కనిపిస్తే స్వయంచాలకంగా మనకు నవ్వు పుట్టుకొస్తుంది. అమాయకంగా కనిపించే బాబు మోహన్ తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ఒక ప్రత్యేకమైన టాలెంట్ తో హాస్యం పండిస్తాడు. కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ ఒకటయ్యారంటే ఇక ఏ సినిమా అయినా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మామగారు సినిమా లో యాచకుడు పాత్రలో నటించి తొలిసారిగా తెలుగు ప్రజల్లో బాగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు.


అప్పుల అప్పారావు, వినోదం, ఉల్టా పల్టా, అల్లరి అల్లుడు, అమ్మోరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, పెళ్లి సందడి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాల్లో అత్యంత సహజంగా నటిస్తూ కోట్ల మంది తెలుగు ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అనంతరం రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి ప్రజలకు సేవ చేశాడు. ప్రస్తుతం బీజేపీ పార్టీ నేతగా ఉన్న బాబు మోహన్ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఓ స్పెషల్ పాటను సకుటుంబ సపరివార సమేతంగా రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాగా ఈరోజు ఓ ప్రముఖ న్యూస్ చానల్ తో ముచ్చటించిన బాబు మోహన్ ఎన్నో విషయాలపై మాట్లాడారు. అలాగే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నిస్తే ఎందుకు నటించను అంటూ సమాధానమిచ్చాడు.


'గతంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. మీకు తెలుగు రాష్ట్రాలలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వారందరూ మీరు ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపిస్తారా అని గంపెడు ఆశలతో ఉన్నారు. మరి వారి కోసం అయినా మీరు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా?' అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా... "నా ఆఖరి శ్వాస వరకు నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నటన నా వృత్తి. పది మందిని నవ్వించడం నా వృత్తి. రాజకీయ నా వృత్తి కాదు. సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. అది కూడా కొందరి కోరిక మేరకు వెళ్లాను. డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. నా వృత్తి సినిమాలు. సినిమాల్లో నటించడానికి నేను ఎప్పుడైనా రెడీ"


"మంచి అవకాశాలు రాక... పిచ్చిపిచ్చి వేషాలు వేయలేక నేను సినిమాల్లోకి రావడం లేదు. నాకు ఏదైనా మంచి పాత్ర లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. కరోనా కట్టడి పై ఓ పాటలో నటిస్తేనే ఎంతో మంది ఎన్నో దేశాల నుండి ఫోన్లు చేసి మరీ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. గొప్ప నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ రావు కూడా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఇలాంటి పొగడ్తలు అందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ చిత్ర పరిశ్రమ నన్ను ఎందుకో దూరం పెడుతుందని అనిపిస్తుంది. మంచి క్యారెక్టర్లు నాకు ఇస్తే చేసేద్దామని నాకు ఉంది కానీ చిత్ర పరిశ్రమ మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదని అనిపిస్తుంది" అంటూ బాబు మోహన్ ని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: