ఐటమ్ సాంగ్ అంటే ముద్దుగుమ్మలు, హీరోయిన్ లే కాదు.. కొన్ని సందర్భాల్లో హీరోలు కూడా చేశాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న ఓ స్టార్ కూడా ఐటమ్ సాంగ్ లో తళుక్కుమన్నాడు. ఆ టాప్ హీరో మరెవరో కాదు మన్మథుడు నాగార్జున. హీరో గా ఫుల్ ఫాంలో ఉన్న సమయంలో నాగార్జున ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడాడు. ఆ సినిమానే ఘటోత్కచుడు.
అచ్చిరెడ్డి నిర్మాతగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఘటోత్కచుడు. అలీ, రోజాలు హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమాలో పౌరాణిక కాలం నుంచి ఘటోత్కచుడిని, భవిష్యత్తు నుంచి రోబోని ఓకేసారి చూపించారు. అందుకే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఓ పాటలో మన్మథుడు నాగార్జున స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు. ఆ పాట సినిమాకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ పాట చిత్రీకరణలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పట్లో నాగార్జున కు ఉన్న యాక్షన్ హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు.
దర్శకుడు ఎస్వీ కృష్ణరెడ్డి మీద గౌరవం తోనే నాగార్జున ఘటోత్కచుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించాడు. అందుకు తగ్గట్టుగా వెస్ట్రన్ స్టైల్లో ఓ అద్భుతమైన పాటను డిజైన్ చేశాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ప్రియ మధురం అంటూ సాగే ఈ పాటను సురేష్ పీటర్, స్వర్ణలతలు ఆలపించారు. ఇప్పటికే ఈ పాట నాగార్జున కెరీర్లో ఓ స్పెషల్ సాంగ్గా నిలిచిపోయింది.