అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప కోసం సుకుమార్ బాగా వర్క్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి బన్నీ సహా సుకుమార్ చాలా శ్రమిస్తున్నారు. కరోనా వల్ల విదేశీ ప్రయాణాలకి అనుమతి లభించనందున మొత్తం సినిమాని ఇక్కడే, ఇక్కడి సాంకేతిక నిపుణుల సాయంతోనే తెరకెక్కిస్తారట. అయితే క్యాస్టింగ్ విషయమే సుకుమార్ కి తలనొప్పిగా మారింది.

 

పుష్ప సినిమాలో ఒకానొక నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసరుగా తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకొన్నారు. కానీ ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి కారణం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడమే. పుష్ప సినిమా అనుకున్నప్పుడు పాన్ ఇండియా ఆలోచన లేదు. అందువల్లే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా సరే విజయ్ ఒప్పుకున్నాడు.

 

కానీ పాన్ ఇండియా లెవెల్లో  తెరకెక్కుతుండడంతో తమిళంలో అల్లు అర్జున్ మొదటి సినిమా అవుతుంది కాబట్టి, ఒక డెబ్యూ హీరో సినిమాలో ఆల్రెడీ ఎన్నో తమిళ సినిమాల్లో హీరోగా కనిపించిన తను విలన్ గా చేయడం వల్ల కెరీర్ నష్టం వస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. అయితే ఇతర భాషల్లో విలన్ గా చేయడానికి రెడీ అని చెప్పాడట. దాంతో విజయ్ స్థానంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు.

 

టాలెంటెడ్ యాక్టర్ బాబీ సింహాని సేతుపతి స్థానంలో తీసుకోవాలని అనుకుంటున్నారు. బాబి సింహా రవితేజ డిస్కోరాజ సినిమాలో విలన్ గా కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సరిగ్గా ఆడకపోవడంతో అతని పేరు బయటకి రాలేదు. బాబీ సింహాకి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. జిగర్తాండ మూవీలో అతని నటనకి జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతానికి సుకుమార్ బాబీ సింహాని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: