డిజిటల్ ప్రపంచంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రచ్చ మొదలయ్యాక థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందరూ ఈ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించేవారు, ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందోనన్న ఆరాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటికి సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటూ, షేర్ చేసుకుంటూ సినిమాలను చూస్తున్నారు నేటి కాలం ప్రేక్షకులు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. జనాలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. వాళ్లకు సినీ వినోదం కావాలి. టీవీల్లో వచ్చేవన్నీ పాత సినిమాలే. పైగా అక్కడ ప్రసారమైన నిర్దేశిత సమయంలోనే ఆయా సినిమాలు చూడాలి. ఇలాంటి తరుణంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు మామూలు గిరాకీ లేదు. జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విరగబడి సినిమాలు చూసేస్తున్నారు.

 

మనకి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇంకా ఎన్నో ఓటిటి యాప్స్ మన తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి. కానీ వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. తెలుగు పరిశ్రమ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ యాప్ ప్రారంభంలోనే మంచి ఆదరణను రాబట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ యాప్ నుంచి మరింత ట్రీట్ తమ వీక్షకులకు అందబోతున్నట్టుగా వారు తెలుపుతున్నారు. ఇటీవలే “కనులు కనులను దోచాయంటే” డిజిటల్ ప్రీమియర్ తో ఆకట్టుకున్న ఆహా లో ఇప్పుడు నాచురల్ స్టార్ నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం” సినిమా కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాతో పాటుగా శ్రీవిష్ణు మరియు నివేతా పేతురాజ్ జంటగా నటించిన తాజా చిత్రం “మెంటల్ మదిలో” మరియు హీరో నవదీప్ ను మెయిన్ లీడ్ లో చేసిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “రన్” లు మంచి ట్రీట్ ఇస్తాయని వారు తెలుపుతున్నారు. 'మెంటల్ మదిలో' ఈ నెల 15న ప్రీమియర్ కు వస్తుండగా 'రన్' 29న డిజిటల్ ప్రీమియర్ గా 'ఆహా' లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానుంది. మరి వీటితో మరోసారి ఆహా అనిపించుకుంటుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: