లారెన్స్ దెయ్యాలను అసలు విడిచిపెట్టడం లేదు. సక్సెస్ సెంటిమెంట్ లా ఫీలవుతూ భూతాలతోనే సినిమాలు చేస్తున్నాడు. ముని, కాంచన, గంగ అంటూ దెయ్యం కథల పరంపరని కంటిన్యూ చేస్తున్నాడు. పిశాచాలను కాంట్రాక్ట్ తీసుకున్నట్టు.. ఆత్మల సినిమాలు చేస్తున్నాడు. ముని సిరీస్ తో బాలీవుడ్ వరకు వెళ్లిన లారెన్స్ ఇప్పుడు చంద్రముఖి సిరీస్ లో అడుగుపెడుతున్నాడు. 

 

ఎవరైనా మనుషులతో ప్రేమలో పడతారు. కానీ లారెన్స్ మాత్రం దెయ్యాల వెనుకపడుతున్నారు. నిను వీడని నీడను నేనే అంటూ దెయ్యాలను విడిచిపెట్టడం లేదు. వరుసపెట్టి పిశాచాలతోనే తిరుగుతున్నాడు. ఎక్కడో మూలన పడిన భూతాలను వెతికి మరీ తెరపైకి తెస్తున్నాడు. 

 

లారెన్స్ కు కోలీవుడ్ లో భూతాల డైరెక్టర్ గా పేరుంది. లారెన్స్ హారర్ స్టోరీ తీస్తే హిట్టే అన్నట్టు ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలేస్తుంటాయి. అందుకే అక్షయ్ కుమార్ కూడా దెయ్యం కథ కోసం లారెన్స్ నే పట్టుకెళ్లాడు. కాంచన రీమేక్ గా రూపొందుతున్న లక్ష్మీబాంబ్ దర్శకత్వ బాధ్యతలను లారెన్స్ కే అప్పగించాడు అక్షయ్. 

 

లారెన్స్ తర్వాత చంద్రముఖి సీక్వెల్ లో నటించబోతున్నాడు. పి. వాసు దర్శకత్వంలో రజినీకాంత్, ప్రభు, జ్యోతిక లీడ్ రోల్స్ లో వచ్చిన చంద్రముఖి సూపర్ హిట్ అయింది. 15ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు వాసు. ఈ సీక్వెల్ లో రజినీ పాత్రను లారెన్స్ చేస్తాడని చెబుతున్నారు.

 

మొత్తానికి రాఘవ లారెన్స్ దెయ్యాలతో జర్నీ చేస్తున్నాడు. వరుసగా భూతాల సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇప్పటి వరకు దెయ్యాల సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన లారెన్స్ చంద్రముఖి 2తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అంతేకాదు హిందీలో కాంచన రీమేక్ బాధ్యతలను మోస్తున్నాడు. చూడాలి మరి లారెన్స్ హవా ఏమాత్రం కొనసాగుతుందో. మొత్తానికి లారెన్స్ కు దెయ్యాల పిచ్చి పట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: