టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులను చిరంజీవి సొంతం చేసుకున్నారు.  స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1955 సంవత్సరం ఆగష్టు నెల 22వ తేదీన చిరంజీవి కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. 
 
చిరంజీవికి తల్లిదండ్రులు నామకరణం చేసిన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిరంజీవికి 1980లో అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన చిరంజీవి పునాది రాళ్లు సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఆ సినిమా కంటే ముందు చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా విడుదలయింది. 1,116 రూపాయలు తొలి పారితోషికంగా అందుకున్న మెగాస్టార్ నేడు 30 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నారు. 
 
కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో, విలన్ పాత్రల్లో నటించిన చిరంజీవి ఖైదీ సినిమాతో హీరోగా నిలద్రొక్కుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాతో బలమైన మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న చిరంజీవి రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమాలతో అభిమానులకు మరింత చేరువయ్యారు.  1990 దశకం చివరిలో జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. 
 
ఇంద్ర, ఠాగూర్ సినిమాలు చిరంజీవి కెరీర్ లో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాజకీయాల్లోకి వెళ్లి పది సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమైన చిరంజీవి రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించారు. సౌత్ ఇండియన్ హీరోలలో డ్యాన్స్ ల ద్వారా చిరంజీవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి చిరంజీవి బ్లడ్ బాంక్, ఐ బాంక్ లను నడుపుతున్నారు. 2006లో భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ భూషణ్ తో సత్కరించింది. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి కెరీర్ లో లెక్కలేనన్ని విజయాలను సొంతం చేసుకున్న చిరంజీవి ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: