ఏ రంగంలోనైనా వీరంగం వేయాలనుకునే వారికి రోజులు కలసి వచ్చేంతవరకే కధ సాగుతుంది. ఆ తరువాత మాత్రం ఎప్పటిలాగానే  కధ కంచికి చేరుతుంది. ఇపుడు అందరి ద్రుష్టి టాలీవుడ్ మీద ఉంది. కరోనా నేపధ్యంలో చూసుకుంటే లాక్ డౌన్ వచ్చిపడింది. సినిమా హాళ్ళు మూత పడ్డాయి. అవి మళ్లీ ఎపుడు తీస్తారో తెలియదు. తీసినా కూడా జనం వస్తారా అన్నది పెద్ద డౌట్.

 

ఈ నేపధ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫారం ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ కంటెంట్ మాత్రమే చూస్తారు. హీరోయిజం అన్నది పట్టించుకోరు. అలాగే స్టార్లూ, సూపర్ స్టార్లు కంటే కూడా కంటెంట్ గొప్ప. దాంతో  ఇక్కడ టాలెంట్ ఉన్న వారి సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఓ విధంగా చిన్న సినిమాలకు ప్రాణం వచ్చినట్లేనని అంటున్నారు.

 

ఇప్పటివరకూ సినిమా హాళ్ళను లీజుకు తీసుకుని గుత్తాధిపత్యం చలాయిస్తూ సమ్మర్, సంక్రాంతి,దాసరా. క్రిస్టమస్ వంటి హాలీడేస్ ని తమకు అట్టేపెట్టుకుని మిగిలిన రోజులను మాత్రం థియేటర్లు వదులుతున్నారు. దాంతో చిన్న సినిమాలు పూర్తిగా చితికిపోతున్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు చిన్న సినిమాల కోసం పోరాడారు. ఆయన తరువాత సినీ  పెద్దల అండ లేకుండా పోయింది.

 

ఈ నేపధ్యంలో తెలుగులో చిన్న సినిమా ఊపిరి ఆగిపోయే దశకు చేరుకుంది. ఇపుడు కరోనా నేపధ్యంలో ధియేటర్ల గోల లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు చిన్న సినిమాలే క్యూ కడుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమేమని, భవిష్యత్తులో చిన్నా, పెద్ద సినిమాలు అన్నీ కూడా ఇక్కడకు రావాల్సిందేనని అని కూడా అంటున్నారు.

 

కరోనాకు వైరస్ వచ్చినా రాకపోయినా జనాల మైండ్ సెట్ మారితే మాత్రం ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ధియేటర్లను గుప్పిట పట్టి గుత్తాధిపత్యం చలాయిస్తున్న బడా బాబులకు లాక్ డౌన్ దెబ్బ బాగానే పడుతోందని అంటున్నారు. కరోనా వైరస్ తరువాత ఇండస్ట్రీ రూపు రేఖలు కూడా మారుతాయని, ఇక పైన స్టార్ల శకం కూడా అంతరించే రోజులు వస్తాయని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: