సిరివెన్నెల.. ఆహా ఈ పేరులో ఉన్న శక్తి ఏంటో తెలియదు గానీ, పదాలకు పదనిసలు నేర్పి, అక్షరాలకు ఆయువు పోసి, సాహిత్య సౌరభాలతో సినీ జగత్తును చిరంజీవిలా ఏలుతున్న కవి కుసుమం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.. ఆయన మనసులో ఎన్నో ఊహాలు ఊపిరిపోసుకుంటుండగా, ఆయన కలంలో వెలకట్టలేని పదాలన్ని అక్షర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాయి.. అలసిన హృదయాలకు ఆయన పాటలు వరాలు.. ఎడబాటుతో రగులుతున్న ప్రేమికుల దాహాన్ని తీర్చే నీటి కొలనులు.. అంతే కాదు మదిని తేలిక చేసేందుకే మనసు బావిలోని భారాన్ని అక్షరాలుగా తోడుతూ సాహిత్యాభిలాషుల గుండెల్లో తిష్ట వేసుకున్న యోగి, సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి..

 

 

మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని, విధాతను సైతం తన పాటల వలపుతో మెప్పించాడు అనడంలో సందేహం లేదు.. తొలి సినిమా సిరివెన్నెల.. అందులో ఉన్న పాటలు అన్ని మనసును దోచేవే.. ఒక పాటకు మరో పాటకు అసలు పోలికలే ఉండవు.. ఇక అందులో నవనాడులను సైతం నాట్యమాడించేలా ఉన్న గీతం.. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం. ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. ఓంకారానికి, గానానికి ముడి వేసి అక్షరాల ముద్దలకు అమృతాన్ని తాగించిన సరస్వతి పుత్రుడు..

 

 

ఇకపోతే ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పేర్చగలరో, దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. ఈ సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న అక్షర పిపాసి సిరివెన్నెల.. ఆయన సాహిత్యంలో ఉన్న లోతులు మనసును మరపించే మంత్రాలు.. ఎందుకంటే సంగీతాన్ని ప్రేమించే మనిషిని ఏడిపించాలన్న, నవ్వించాలన్న, కవ్వించాలన్నా, వేదనతో రగిలేలా చేయాలన్న అది శాస్త్రిగారి కలానికే సాధ్యం.. అలుపెరుగని అక్షర శ్రామికుడు.. అక్షర సేద్యాన్ని అలవోకగా పండిస్తున్న కవి మహరాజు..

 

 

ఈ సినీ సాహిత్యంలో ఎందరో కొత్త కవులు వస్తున్న.. ఆయనుకున్న ప్రత్యేకత, అయన స్దానం ఎప్పుడు పదిలమే.. అక్షరమే అలసిపోవాలి కాని, ఆయన మనసుకు మాత్రం అలుపు లేదు.. అందుకే ఎన్నో అవార్డులు ఆయన జీవితంలోకి వచ్చి చేరాయి.. ఇకపోతే రేపు అనగా మే 20 వ తారీఖు ఆ అక్షర బ్రహ్మ సిరివెన్నెల గారి పుట్టిన రోజు సందర్భంగా మా సంస్ద తరపున శుభాకాంక్షలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: