చూస్తూంటే అలా ఇలా లేదు. అదేదో సినిమాలో హీరో విలన్ తో చెప్పినట్లుగా బులెట్ దిగింది కానీ కొవ్వు బాగా బలిసిపోవడం వల్ల వెంటనే తెలియడంలేదు అన్నట్లుగా సినీ సీమ పరిస్థితి ఉంది. కరోనా వచ్చింది ఎందుకు అంటే ఠక్కున సినిమా వాళ్ళు చెప్పే సమాధానం మా మీద దెబ్బేయడానికేనని, సీన్ చూస్తూంటే అలాగే ఉంది.

 

లేకపోతే కరోనా వల్ల లాక్ డౌన్ ఇది రెండు నెలలు విధించారు. ఇంకా పొడిగిస్తూ పోతారు. సరే అవన్నీ ఎలా ఉన్నా మిగిలిన రంగాలు అన్నీ తెరచుకున్నా వెండి తెర బొమ్మలకు మాత్రం ఇప్పట్లో అవకాశం లేదని అంటున్నారు. సినిమా షూటింగులకు కూడా లాక్ డౌన్ కరోనా పెద్ద అడ్డంకిగా మరాయని అంటున్నారు.

 

ఒక సినిమా రిలీజ్ కావాలంటే ధియేటర్లు ఉండాలి. కానీ ధియేటర్లు తెరవవద్దు అంటున్నారు. అవి ఇప్పట్లో తెరవవద్దు అని ప్రతీ వారూ అంటున్నారు కానీ ఎప్పటిలోగా తెరవాలి అన్నది మాత్రం చెప్పడంలేదు. అది నిత్యావసరం కాదు, వట్టి వినోదం, పైగా జనాలతో, జాతరతో కూడుకున్న వ్యవహారం. దాంతో సినిమాలకు ఏం తొందర అని అంటున్నారు.

 

దీని మీద ప్రముఖ సినీ నిర్మాత శోభు యార్లగడ్డ వంటి వారి కామెంట్స్ చూస్తూంటే సినిమా పరిశ్రమ భవిష్యత్తు మీద బెంగ పుడుతుంది. సినిమాకు  కరోనా పెద్ద దెబ్బ తీసిందని శోభూ అంటున్నారు. సినిమా హాళ్ళను అలా నెలల తరబడి మూసి ఉంచడం వల్ల నష్టం అలా ఇలా ఉండదని కూడా ఆయన చెబుతున్నారు. ఇదే మాటను మిగిలిన పెద్దలు కూడా అంటున్నారు.

 

సినిమా రంగానికి ఓ విధంగా గడ్డు రోజులు వచ్చాయని కూడా వారు చెబుతున్నారు. కరోనా మహమ్మారి సినిమా హాళ్ళు తెరవడం వల్లనే వీర విహారం చేస్తుందని భావిస్తూండడం పట్ల కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. అది కూడా  ఒక కీలకమైన ఉపాధి రంగమేనని కూడా అంటున్నారు.

 

కానీ సినిమా హాళ్ళను మూసేయాలని, షూటింగులు ఆపేయాలని చెప్పడం వల్ల చాలా మంది ఆధారపడిన వారు ఇబ్బందుల్లో పడుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారి కసిదీరా కాటేసింది మాత్రం సినిమా రంగాన్నేనని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: