పౌరాణిక పాత్రలకు నందమూరి ఫ్యామిలీ హీరోలు పెట్టింది పేరు. ఎన్టీఆర్ పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరే నటుడు పోషించలేదంటే అతిషయోక్తి కాదు. ముఖ్యంగా కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రాముడిగా, కర్ణుడిగా ఆయన పోషించిన పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అదే వారసత్వాన్ని  కొనసాగిస్తూ బాలకృష్ణ కూడా పౌరాణిక, చారిత్రక పాత్రల్లో కనిపించాడు. ముఖ్యంగా తండ్రి పోషించిన కృష్ణుడు, రాముడిగా అభిమానులను మెప్పించాడు. అయితే బాలయ్య చేసిన ఈ ప్రయత్నాల్లో కొన్ని సక్సెస్‌ కాగా కొన్ని దారుణంగా విఫలమయ్యాయి. అలాంటి ఓ ఫెయిలర్‌ అటెంప్టే పాండు రంగడు.

 

సీనియర్ ఎన్టీఆర్ 50లలోనే పాండు రంగడు సినిమాలో నటించాడు. అప్పట్లో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. తరువాత ఎన్టీఆర్ నట వారసుడిగా బాలయ్య కూడా అదే కథతో రూపొందిన సినిమాలో నటించాడు. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకుడు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్‌పై కే కృష్ణమోహన్‌ రావు ఈ సినిమాను నిర్మించాడు. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వచ్చింది.

 

బాలయ్య సరసన టబు, స్నేహలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కళా తపస్వి కే విశ్వనాథ్‌ నటించారు. అయితే భక్తిరస చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో భక్తి కన్నా ఎక్కువగా తెర మీద రక్తి కనిపించటంతో ప్రేక్షకులు సినిమాను రిజెక్ట్ చేశారు. కీరవాణి అందించిన సంగీతం, పాటలు ఓ మేరకు ఆకట్టుకున్నా సినిమాను విజయతీరాలు చేర్చే స్థాయిలో మాత్రం అలరించలేకపోయాయి. దీంతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాండురంగడు కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయింది. అంతకు మించి తండ్రి సూపర్‌ హిట్ సాధించిన కథను ఎంచుకొని బాలయ్య తప్పు చేశాడన్న అపప్రథను మూటగట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: