మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా రాజకీయాలపైన సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడు ప్రత్యర్థులతో విమర్శలు ఎదుర్కొనే నాగబాబు సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన వ్యాఖ్యలు. మహాత్మ గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను ఇండియాలో గొప్ప దేశభక్తుడిగా అభివర్ణిస్తూ.. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశమని వివాదాస్పద చర్చకు దారిచూపాడు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యల పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నిన్న ఒక ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న వర్మ.. గాడ్సే దేశభక్తి విషయంలో నాగబాబు చెప్పింది నిజమేనంటూ ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించారు. 

 

ఆయన మాట్లాడుతూ.. "నాథూరాం గాడ్సే.. గాంధీని చంపాడని మాత్రమే చెబుతున్నారు. కానీ ఎందుకు చంపాడో అనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే అతడు విలన్‌గా మారిపోయాడు. గాడ్సే మామూలుగా గాంధీకి ఫాలోవర్. స్వాతంత్రం వచ్చేసింది. భారత్-పాక్ విడిపోయాయి. గాడ్సే కోరుకున్న రెండూ జరిగిపోయాయి. అయినా కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఆ టైమ్‌ లో అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీని జాతిపిత అని చెప్పాం. దాని తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితిలో గాంధీని ఎందుకు చంపారనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి తొక్కిపెట్టారు. ఏది ఏమైనా గాడ్సే దేశభక్తి విషయంలో నాగబాబు గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తా'' అని వర్మ వెల్లడించారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: