చిత్తూరు నాగ‌య్య ఒక మ‌హాయోగి, గొప్ప న‌టుడు. ఆకాశాన్ని, భూమిని రెండింటిని స‌మానంగా చూసిన‌వాడు. అంతేకాదు సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. నాగయ్య పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి పాత్రలు ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం సాధించిన మొట్ట మొదటి తెలుగు నటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించిన ఈయన 1938 లో వచ్చిన గృహలక్ష్మి సినిమాతో సినీ రంగ ప్రవేశం మొదలఒంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య ఎన్నో సినిమాలకు సంగీతం, ఎడిటింగ్, సహాయ దర్శకుడిగా ఇలా పలు విభాగాల్లో పనిచేశాడు. తర్వాత నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించారు. 

 

అప్పట్లో రేణుకా ఫిల్మ్‌ ప్రొడ‌క్ష‌న్స్ అంటే ధ‌ర్మ‌స‌త్రమని చెప్పాలి. ఆక‌లి తో ఎవ‌రైనా వ‌చ్చి భోజ‌నం చేయ‌వ‌చ్చు..అడిగేవారే ఉండరు. ఎవరు నువ్వు అని ప్ర‌శ్నించ‌రు. అంతేకాదు ఈ సంస్థ య‌జ‌మాని నాగ‌య్య వ‌స్తే క‌ష్టాల్లో ఉన్న‌వాళ్లు చుట్టూ చేరేవాళ్లు. వాళ్ళ కష్ఠాలు విన్న ఆయన జేబులో ఉన్న డ‌బ్బుని లెక్క పెట్టుకోకుండా తీసి పంచేసేవారు. 1940లో బంగారు తులం రూ.36. అయితే అప్పుడే నాగ‌య్య పారితోష‌కం రూ.ల‌క్ష‌. అంటే అర్థం చేసుకోవచ్చు నటుడిగా ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో.

 

ఒక స‌న్నివేశంలో ప‌రుస‌వేది విద్య ల‌భించింద‌నే సంతోషం, అన్న కూతురు చ‌నిపోయింద‌నే క‌న్నీరు, ఏక‌కాలంలో ఆయ‌న ప‌లికించిన భావాలు, నాగ‌య్య మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. భ‌క్త‌పోత‌న‌లో పోత‌న ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది. శ్రీ‌నాథుడిగా గౌరీనాథ‌శాస్త్రి, పోత‌న‌గా నాగ‌య్య పోటాపోటీగా ఉంటారు. చిత్తూరులో పుట్టిన నాగ‌య్య‌, టీటీడీ వారి సాయంతో చ‌దువుకున్నారు. త‌ర్వాత జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు. బీఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి దృష్టిలో ప‌డిన త‌ర్వాత నాగ‌య్య వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

 

జీవితంలో జరిగిన అనేక సంఘ‌ట‌న‌లు ఆయ‌న్ని వైరాగ్యం వైపు నెట్టాయి. మొద‌టి భార్య చ‌నిపోయారు, బిడ్డ కూడా చ‌నిపోయింది. రెండో భార్య గ‌ర్భ‌వ‌తిగా ఉండి చ‌నిపోయారు. జీవితం ఒక గాలి బుడ‌గ లాంటిది, ఉన్నంత‌లో ప‌ది మందికి సాయం చేయాల‌ని అనుకున్నారు, చేశారు. తిరువాన్కూరులో ఏనుగు మీద ఊరేగి, రాజుగారి సింహాస‌నం మీద కూర్చొని స‌న్మానం అందుకున్న నాగ‌య్య‌, చివ‌రి రోజుల్లో రూ.500కు కూడా వేషాలు వేశారు. ఆయ‌న ప్ర‌తిభ గురించి తెలియ‌ని కొందరు మూర్ఖులు ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌డ్డాలు, మీసాలు అతికించి మేక‌ప్ వేసి, సాయంత్రం షాట్‌కి పిలిచేవాళ్లు. ఆ రోజుల్లో గ‌డ్డానికి వాడే గ‌మ్ చాలా హింస పెట్టేదట. అదంతా చిరున‌వ్వుతో భ‌రించేవారు.

 

తొలిరోజుల్లో హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం, నాగ‌య్య ఇంట్లోనే భోజ‌నం చేసి, అక్క‌డే ఉండేవాడు. వేషాలు లేని న‌టుల‌కి నాగ‌య్య ఇల్లు ఒక దేవాల‌యం. త‌ర్వాత రోజుల్లో పొట్టిప్లీడ‌ర్‌లో చిన్న వేషం వేసినందుకు ప‌ద్మ‌నాభం రూ.10 వేలు ఇస్తే, ఇది చాలా పెద్ద మొత్తం నాయ‌నా అన్నాడ‌ట‌. ఈ డ‌బ్బులు వేషానికి కాదు, దిక్కులేని న‌న్ను ఒక‌ప్పుడు ఆద‌రించినందుకు అని ప‌ద్మ‌నాభం అంటే "అప్పుడు నా ఇంట్లో నీకే ఇబ్బంది క‌ల‌గ‌లేదు క‌దా" అని అడిగాడ‌రు. అది నాగ‌య్య‌ మంచు లాంటి మనసు.

 

ప్ర‌పంచం దృష్టిలో నాగ‌య్య లౌక్యుడు కాక‌పోవ‌చ్చు... బ‌త‌క‌డం తెలియ‌క‌పోవ‌చ్చు... భోళా మ‌నిషి... ముందు చూపులేని వాడు.... ఇలా ఎన్ని మాట్లాడినా నాగ‌య్య ప్ర‌పంచం వేరు. జీవితంలోని మ‌కిలిని, క‌ల్మ‌షాన్నిఅంటించుకోకుండా జీవించిన వారు. ఆక‌లి అన్న ప్ర‌తివాడికి అన్నం పెట్టిన వారు. అందుకే ఆ ముఖంలో అంత స్వ‌చ్ఛ‌త‌. ల‌వ‌కుశ చూస్తే వాల్మీకీ ఇలాగే ఉండేవాడా అనిపిస్తుంది. దుఖపు జీర‌తో "క‌ష్టాలు శాశ్వ‌తంగా ఉంటాయా త‌ల్లీ" అని సీత‌మ్మ‌తో అంటారు.

 

డిసెంబ‌ర్ 30, 1973 నాగ‌య్య మ‌ర‌ణించారు. నాగ‌య్య శ‌వాన్ని చూడ‌డానికి mgr వ‌చ్చారట. ప్రశాంతంగా శాశ్వ‌త నిద్ర‌లో ఉన్న నాగ‌య్య‌ని చూసి ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. నాగ‌య్య మేన‌ల్లుడిని పిలిచి అడిగితే అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులు లేవ‌ని తెలిసింది. రూ.5 వేలు ఇచ్చి mgr నాగ‌య్య‌ని గౌర‌వించారు. జీతంలో ఏదీ శాశ్వ‌తం కాద‌ని తెలిసిన నాగ‌య్య ఒక మ‌హ‌ర్షి, మ‌హాన‌టుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: