'డార్లింగ్' ప్రభాస్ - పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 70స్ కాలానికి సంబంధించిన ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో సెట్ వేసి చిత్రీకరించి ఇండియాకి తిరిగి వచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్ - పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట.

 

కాగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటికే చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఐతే గతంలో బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మరియు నేషనల్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అమిత్ త్రివేది ఇంతకముందు తెలుగులో 'సైరా నరసింహా రెడ్డి' 'దట్ ఈజ్ మహాలక్ష్మి' 'వి' సినిమాలకి సంగీతాన్ని అందించారు. వాటిలో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' 'వి' సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. కానీ 'వి' సినిమా నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఐతే ప్రభాస్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన తాజా వ్యాఖ్యలు రుజువు చేశాయి.

 

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ తెలుగులో నాని - సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన 'వి', 'క్వీన్' రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' మినహా ఎటువంటి తెలుగు సినిమాకు సంగీతం అందించడానికి ఒప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారట. దీనితో ప్రభాస్ మూవీకి అమిత్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయంలో నిజం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయబోతున్నాడనే విషయం ఆసక్తిగా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత చిత్రం 'సాహో' విషయంలో కూడా మొదట ఇలాంటి కన్ఫ్యూజనే ఏర్పడింది. ఈ సినిమాకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసారు. తనిష్క్ బాఘ్చి, గురు రంధ్వా, బాద్షా, శంకర్ ఎషాన్ లాయ్ సాంగ్స్ అందించగా జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. మరి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని కంఫర్మ్ చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: