ఇటీవల కాలంగా కంటెంట్‌ ప్రధానంగా సాగే చిత్రాలకు, తెరకెక్కించే దర్శకులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆ చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పడుతుంటారు. ఇప్పటికే మన దక్షిణాదిలో హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసారు. వాటితో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన తమిళ సినిమా ఖైదీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన 'ఖైదీ' సినిమా తమిళ్‌ తో పాటు తెలుగులోనూ సూపర్‌ హిట్ అయ్యింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. అందుకే ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి బాలీవుడ్ అజయ్ దేవగన్ ను సంప్రదించగా.. అజయ్ దేవగన్ సైతం ఈ చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్ళింది. 

 

కాగా తాజాగా ప్రభుత్వాలు కొన్ని షరతులతో సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. కానీ కరోనా నేపథ్యంలో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్ - డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ హిందీ 'ఖైదీ'ని రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కార్తీకి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించగా.. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి. అజయ్ దేవగన్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం ద్వారా మన తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: