కరోనా కారణంగా థియేటర్లీ మూతబడ్డాయి. రోజు రోజుకీ కోవిడ్ ఉధృతి పెరుగుతుండడంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా కొన్ని పరిశ్రమలకి, వ్యాపార సంస్థలకి మినహాయింపులు ఇచ్చినప్పటికీ, వందల మంది ఒకే చోట కూర్చుని చూసే సినిమాహాళ్ళకి మాత్రం అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

లాక్డౌన్ కి ముందు విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలా అనుకుంటున్నవారిలో నాని నటించిన వి చిత్రం కూడా ఉంది. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది రోజున విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా లాక్డౌన్ పెట్టేయడంతో వాయిదా పడింది. ఇప్పటికి రెండు నెలలయినా లాక్డౌన్ ఇంకా తొలగిపోలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది.

 

దీంతో వి సినిమా ఓటీటీలో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు కూడా ఓటీటీలో రిలీజ్ చేయడంపై సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నిజానికి దిల్ రాజు ఓటీటీ వైపు చూడట్లేదట. దిల్ రాజు ఎంత సక్సెస్ ఫుల్ నిర్మాతనో, అంత సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కుడా. ఎన్నో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కిన వి చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోవట్లేదట.

 

ఓటీటీ వల్ల థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడుతుందన్న వార్తలు వస్తుందన్న నేపథ్యంలో తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్లని నిరాశకి గురి చేయడం ఇష్టం లేదట. అందుకే వి సినిమాకి ఓటీటీ నుండీ ఎంత మంచి ఆఫర్ వస్తున్నా కూడా దిల్ రాజు ఒప్పుకోవట్లేదని అంటున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే దిల్ రాజు పునరాలోచించుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: