దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ క్లోజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు ఆగిపోయాయి.. థియేటర్స్ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వారు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని, ప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం సూచించారు. జూన్‌ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

 

తాజాగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో మరోసారి భేటీ అయ్యారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అద్యక్షుడు నరేష్, ఎఫ్ డి సి మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుందని.. 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుందని తెలియజేశారని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: