థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే సినిమాల్లో ట్విస్టులు ఎక్కువగా ఉంటుంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ఏమీ అర్థం కానివ్వకుండా చివర్లో ఒకే ఒక్క ట్విస్ట్ తో సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఆ మలుపులనే ట్చిస్ట్ అంటుంటారు. అయితే ఈ ట్విస్టులు ప్రతీసారీ పనిచేయవు. కొన్ని సార్లు ఆడియన్స్ ముందే ఊహించేస్తుంటారు. అలాంటప్పుడు ఎంత మంచి ట్విస్ట్ ఉన్నా ఎగ్జైటింగ్ గా అనిపించదు.

 


తెలుగులో తెరకెక్కే థ్రిల్లర్ కథాంశాలు చాలా తక్కువ. మనవాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. థ్రిల్లర్ సినిమాలకి కలెక్షన్లు కూడా ఎక్కువగా రావు. అది నిజమని నిరూపించిన చిత్రం నాని నిర్మాతగా మారి నిర్మించిన "అ". ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి థ్రిల్ ని కలిగించింది. కానీ కలెక్షన్ల పరంగా అంతగా రాబట్టలేకపోయింది.

 

ఈ చిత్రంలో క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ ద్వారానే అసలు కథ ఏంటనేది తెలుస్తుంది. సినిమా కథ ఏంటనేది సినిమా చివరి వరకూ అర్థం కాదు. క్లైమాక్స్ లోనే మర్మాన్ని దాచిన ప్రశాంత్ వర్మ తన రెండవ చిత్రం కల్కిలోనూ అదే రిపీట్ చేశాడు. సినిమాకి కీలకమైన ట్విస్టుకి చివర్లో రివీల్ చేసి ఆహా అనిపించాలని అనుకున్నాడు. అయితే అ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి బాగా ఎగ్జైట్ అయిన జనాలు కల్కి సినిమా క్లైమాక్స్ కి అంతగా ఎగ్జైట్ అవలేదు.

 

అయినా కూడా తన మూడవ చిత్రంలోనూ అదే తరహా ట్విస్టు ఉంటుందని చెబుతున్నాడు. ప్రశాంత్ వర్మ తన తర్వాతి చిత్ర ఫస్ట్ లుక్ ని  రివీల్ చేయబోతున్నాడట. గత రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినపుడు అందులో క్లైమాక్స్ కి సంబంధించిన ట్విస్ట్ ని హింట్ రూపంలో ఇచ్చాడట. ఈ సారి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ట్విస్ట్ కి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నాడట. గత రెండు చిత్రాల్లో ఎవరు గుర్తించారో తెలియదు గానీ ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో ఎలాంటి హింట్ ఇవ్వబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: