పాటలు లేని తెలుగు సినిమాను ఊహించలేరు తెలుగు ప్రేక్షకులు. పాటలు లేకుండా సినిమా చూడలేం కూడా. పాటకు ట్యూన్ కట్టడం ఎంత కష్టమో.. ఆ పాటకు సాహిత్యం అందించడం కూడా అంతే కష్టం. సన్నివేశానికి తగ్గట్టుగా ఓ పాట ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఈ రెండు విభాగాలు కష్టపడాల్సిందే. అందుకే గేయ రచయిత చంద్రబోస్ కష్టాన్ని గుర్తించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. చంద్రబోస్ సినిమాల్లో పాటలు రాయడం మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా పాట రూపంలో ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

 

 

రంగస్థలంలో ‘ఎంత సక్కగున్నావే’ పాట ఎంత హిట్టయిందో తెలిసిన విషయమే. ఆ పాటకు సాహిత్యం, సంగీతం అందించింది వీరిద్దరే. ఇదే పాట ట్యూన్ కు  లిరిక్స్ మార్చి చంద్రబోస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని వివరించాడు దేవిశ్రీ. రాసుకోవడమే కాదు ఆ లిరిక్స్ ను తానే ఆలపించాడు కూడా. ‘ఒకటీ రెండూ కాదూ.. మూడు నాలుగూ కాదు.. ఇరవై అయిదేళ్లుగా..’ అంటూ రాసుకున్న పాటను అంతే శ్రావ్యంగా ఆలపించాడు దేవిశ్రీ. ఈ పాట రూపకల్పన చేయడం ద్వారా చంద్రబోస్ పై తన ప్రేమాభిమానాలను చాటుకున్నాడు దేవీశ్రీ. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

 

 

1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో గీత రచయితగా పరిచయమయ్యాడు చంద్రబోస్. 25ఏళ్లుగా అద్భుతమైన సాహిత్యంతో తెలుగు పాటను ఉరకలెత్తించాడు. తొలి చిత్రంతోనే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు కూడా అందుకున్నాడు చంద్రబోస్. ఆయన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేసి సాహిత్యంలో తనకు ఉన్న పట్టును నిరూపించుకున్నాడు. బొంబాయి ప్రియుడు సినిమాలోని ఓ పాటలో ‘అదర కాగితం’ అని చంద్రబోస్ చేసిన ప్రయోగం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: