టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా లో మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించారు. సరిలేరు విజయంతో వరుసగా మూడవ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, దానితో హ్యాట్రిక్ కొట్టారు. అయితే సరిలేరు తరువాత మహేష్ నటించబోయే తదుపరి సినిమా విషయమై కొద్దిరోజులుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయిన విషయం తెలిసిందే. 

IHG

ముందుగా ఆయన మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే వంశీ కథ పూర్తిగా సిద్ధం కాకపోవడం, అలానే అదే సమయంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల మంచి కథతో మహేష్ వద్దకు వెళ్లి చెప్పడం, అది ఆయనకు నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా ఎట్టకేలకు ఆ సినిమాకు సంబంధించి నేడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు నిర్మాతలు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ని నిర్ణయించిన ఆ సినిమాలో మహేష్ మంచి మాస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు కొద్దిపాటి గడ్డంతో రఫ్ లుక్ లో కనపడడంతో పాటు స్టైలిష్ గా చెవికి పోగు, మెడ పై రూపాయి టాటూ కూడా వేయించుకుని ఉండడం గమనించవచ్చు. నిజానికి మహేష్ కొన్నేళ్ల క్రితం నటించిన పోకిరి తరువాత ఇప్పటివరకు సరైన మాస్ సినిమా ఆయన నుండి రాలేదనే నిరాశక్తి మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. 

 

కాగా ఆ లోటును ఈ సర్కారు వారి పాట తీర్చనుందని టాక్. మహేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో అదిరిపోనుందని, మంచి మాస్ అంశాలతో పాటు ఆకట్టుకునే పలు కమర్షియల్ హంగులతో ఎంతో భారీ లెవెల్లో దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాక్ డౌన్ అనంతరం ప్రారంభం కానుందని, అన్ని కలిసి వస్తే సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత మంచి మాస్ అవతార్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మహేష్, ఈ సినిమాతో ఎంతమేర సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: