ప్రస్తుతం తెలుగులో రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు నుండి ఇతర భాషల్లోకి సినిమాలూ రీమేక్ అవుతున్నాయి. అలాగే ఇతర భాషల్లో నుండి తెలుగులో రీమేక్ అయ్యే చిత్రాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా మనవాళ్ల దృష్టి కొరియన్ సినిమాలపై పడింది. కొరియన్ చిత్రాల రీమేక్ హక్కులని కొనుక్కుని తెలుగులో రీమేక్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పటికే నిర్మాత సురేష్ బాబు దగ్గర పదికి పైగా కొరియన్ సినిమా హక్కులు ఉన్నాయని సమాచారం.

 

మొన్నటికి మొన్న సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. కొరియన్ మూవీ అయిన మిస్ గ్రానీ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం సమంత కెరీర్లో మంచి విజయాన్ని అందించింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఓ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. అయితే తాజాగా సుధీర్ వర్మ ఓ కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

 

మిడ్ నైట్ రన్నర్స్ అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకి తగిన విధంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడని అన్నారు.  అంతే కాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నివేదా థామస్, రెజీనా కెసాండ్రా ప్రధాన పాత్రలుగా చేయనున్నట్లు వెల్లడించారు కూడా. రెజీనా ప్రధాన పాత్రలో వచ్చిన ఎవరు మూవీ ఆమెకి మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. దాంతో ఈ సినిమా కూడా మరో విజయాన్ని ఇస్తుందని నమ్మింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపించట్లేదు.

 

ఇద్దరు హీరోయిన్లు పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్న ఈ చిత్రం ఆగిపోయిందని అంటున్నారు. కరోనా కారణంగా ఈ సినిమాకి బడ్జెట్ సమస్యలు ఎదురయ్యయని, అందువల్లే సినిమా ఆగిపోయిందంటూ చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. రణరంగం సినిమాతో ఫెయిల్యూర్ ని మూటగట్టుకున్న సుధీర్ వర్మ కి ఈ సినిమా చేసే అవకాశం ఉందో లేదో..!

మరింత సమాచారం తెలుసుకోండి: