సాహసానికి పెట్టింది పేరు.. కొత్త దనాన్ని ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరికీ భయపడకపోవడం ఆయన తత్వం. ప్రయోగాలనే ఇంటి పేరుగా మార్చుకున్న సాహసి. నమ్ముకున్న వాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్లే మనసున్న మనిషి. తెలుగు సినీ చరిత్రలో జరిగిన ప్రతీ మార్పుకు సాక్షి. ఆయన సూపర్ స్టార్ కృష్ణ. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన సాహసాలు ఓ సారి నెమరువేసుకుందాం. 

 

తెలుగు ఇండస్ట్రీలో అందరిదీ ఓ దారి అయితే.. కృష్ణది మాత్రం మరోదారి. నలుగురూ నిచే దారిలో వెళ్తే కొత్తేముంది అని భావించిన కృష్ణ.. కొత్తదనాన్ని అన్వేషించేవారు. ఈ క్రమంలో ఎన్నో ఎన్నో కొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 

 

నటశేఖరుడు, సూపర్ స్టార్ అనే బిరుదులున్నా.. ఏ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోని హీరో కృష్ణ. చిన్నాపెద్దా అని తేడాలేకుండా అన్ని తరాల దర్శకులతో పనిచేశారు. ఐదు దశాబ్ధాల కెరీర్ లో 345 సినిమాల్లో నటించి రికార్డులు సృష్టించారు నటశేఖరుడు. 

 

ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేయడంలో కూడా కృష్ణ ఎప్పుడూ నెంబర్ వన్. తొలి జేమ్స్ బాండ్, తొలి కౌవ్ బాయ్.. రోల్స్ చేసి తెలుగులో ఇలాంటి తరహా సినిమాలకు ఆధ్యుడిగా నిలిచారు కృష్ణ. కొన్ని పాత్రలైతే కృష్ణ కోసమే పుట్టాయి. సాక్షిలో పల్లెటూరి వాడిగా మెప్పించన కృష్ణ.. గూడాచారిలో ఏజెంట్ గా అదరగొట్టాడు. మోసగాళ్లకు మోసగాడులో కౌబాయ్ గా కనిపించిన సూపర్ స్టార్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. 

 

తెలుగు సినిమాకు టెక్నాలజీని పరిచయం చేసిన కథానాయకుడు కృష్ణ. ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగులో మొదటి సినిమా స్కోప్ గా నిలిచింది. సింహాసనం తొలి 70ఎమ్ఎమ్ చిత్రం కాగా.. తెలుగు వీర లేవరా తొలి డీటీఎస్ మూవీ కావడం విశేషం. 

 

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇప్పటి హీరోలు ఎన్నో కారణాలు చూపిస్తున్నారు. కానీ ఈ తరహా సినిమాలు చేయడంలో కింగ్ మాత్రం కృష్ణానే. ఏఎన్నార్ సినిమాల్లో చిత్ర పాత్రలు చేసిన కృష్ణ.. తోటి నటులైన శోభన్ బాబు, కృష్ణం రాజుతో కలిసి ఎన్నో మల్టీస్టారర్స్ లో నటించారు. ముఖ్యంగా శోభన్ బాబుతో కలిసి కృష్ణ నటించిన సినిమాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. 

 

50ఏళ్లు దాటిన తర్వాత కూడా హీరోగా రాణించారు కృష్ణ. చిరంజీవి, బాలకృష్ణ లాంటి కొత్త తరం హీరోలు వచ్చినా.. పోటీలో నిలబడ్డారు. తొంభైల్లోనూ అదిరిపోయే హిట్లు కొట్టి సూపర్ స్టార్ కు అసలైన అర్థం చెప్పారు. ఈ తరం హీరోలతో కూడా కలిసి నటించి.. అన్ని తరాల హీరోలకు వారధిగా నిలిచారు. 

 

హీరోయిన్ల విషయంలోనూ కృష్ణకు ఓ రికార్డ్ ఉంది. కృష్ణతో అత్యధికంగా 47సినిమాల్లో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించారు విజయనిర్మల. ఆమె తర్వాత జయప్రద 43, శ్రీదేవి 31 సినిమాలు చేశారు. 

 

రియల్ హీరో కృష్ణ సుదీర్ఘ నట జీవితంలో అందుకున్న అవార్డులు, రికార్డులు ఎన్నో. ప్రేక్షకులతో సూపర్ స్టార్, నటశేఖర్ అనిపించుకున్న కృష్ణకు రాష్ట్రం ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందిస్తే.. కేంద్రం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: