ఇళయ రాజా.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. ఈ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్ ఇళయరాజా నేడు త‌న 72వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇళయరాజా పాటలకు ఫ్యాన్స్ ఉన్నారాంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా ఈయ‌న మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు క్లాసిక్ అనదగ్గ సంగీతాన్ని ఇళయరాజా అందించారు. 1976లో‌ తమిళ సినిమా అణ్ణక్కిళి తో చలన‌ చిత్ర సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు ఇళయరాజా.

 

గత 44‌ ఏళ్లలో‌ వివిధ భాషల్లో 1000‌కి పైగా సినిమాలు చేశారు. తొలి సినిమాతోనే ఇన్ని సినిమాలకు కావలసిన పునాది వేసుకున్నారు ఈయ‌న‌. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి ’సింఫనీ’ ని కంపోజ్ చేసారు. ఆసియా ఖండం లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే సంగీత దర్శకుడిగా ఐదు జాతీయ అవార్డులు అందుకుంటే.. అందులో తెలుగులో ఈయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సాగర సంగమం, రుద్రవీణ సినిమాలకు అవార్డు దక్కడం విశేషం. అయితే 1943 జూన్ 02 వతేదీన జ‌న్మించిన ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. స్కూల్ లో చేర్పించేటప్పుడు జ్ఞానదేశికన్ పేరుని ఆయన తండ్రి రాజయ్య గా మార్పించారు. 

 

సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును మ‌ళ్లీ రాజా గా మార్చారు. ఇక 1976 లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో అన్నకిలి చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ’ఇళయ’ అని పిలిచేవాడు. ఇళ‌య అంటే చిన్నవాడు అని తమిళ్ లో అర్థం. ఇక ఆ రోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండుపదాలని కలిపి చివ‌ర‌కు ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో కష్టాలు... ఎన్నెన్నో అవమానాలు... ఇంకెన్నో తిరస్కారాలు...‌ అన్నీ పడ్డాక జ్ఞానదేశికన్ ఇళయరాజా అయి సంగీత సాగరంలో ఉవ్వెత్తున లేచిన కెరటం అయ్యారు. అణ్ణక్కిళితో ఎగసిన‌ ఇళయరాజా శిఖరాలను అందుకున్నారు. అలాంటి ఇళ‌య‌రాజా మ‌రెన్నో పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని కోరుకుందాం.
\

మరింత సమాచారం తెలుసుకోండి: