నందమూరి తారకరామరావు నట వారసుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా స‌త్తా చాటారు.  బాలయ్య అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఇక బాల‌య్య బొమ్మ ప‌డితే.. థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాల్సిందే. 1974లో ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 చిత్రాల్లో నటించారు. ఇక బాల‌య్య‌ సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం ‘సాహసమే జీవితం’. 

 

ఈ చిత్రానికి భారతీ వాసు దర్శకత్వం వహించారు. అయితే బాల‌య్య‌కు హీరోగా బ్రెేక్ ఇచ్చిన చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగమ్మ గారి మనవడు` అని చెప్పాలి. ఇక ఆ త‌ర్వాత వచ్చిన నారీ నారీ నడుమ మురారి చిత్రంతో విశ్వరూపం చూపారు. అనంతరం లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్‌స్టెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద గర్జించి నందమూరి నటసింహంగా మారారు. ఇక కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ మూవీస్ చేసినప్పటికీ.. ఎక్కువ శాతం పక్కా మాస్ సినిమాలనే చేశారాయన.

 

ముఖ్యంగా  సమరసింహారెడ్డి.. చిత్రం బాలకృష్ణలో ఉన్న నటసింహాన్ని నిద్ర లేపింది. ఈ సినిమాతో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్  డైలాగులు, ఇతర యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే టాలీవుడ్‌లోని చాలా తక్కువ మంది మాస్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. ఇక డైలాగ్ డెలివరీలోనూ ఆయనను మించిన వాళ్లు లేరు అన‌డంలో సందేహం లేదు. అలాంటి బాల‌కృష్ణ నేడు త‌న 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నంద‌మూరి అంద‌గాడు..1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించాడు. 

 

అయితే 1974లో తాతమ్మ కల సినిమాతో మొదలైన బాలకృష్ణ యాక్షన్ జర్నీ 46 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక నటవారసుడిగా హీరోగా ఇన్నేళ్లు నటించడమనేది ప్రపంచ సినీ చరిత్రలో ఏ వారుసుడికి సాధ్యం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే.. నట వారసుల్లో బాలయ్యది తిరుగులేని రికార్డు అనే చెప్పాలి. మ‌రియు సుదీర్ఘ కాలంగా టాప్‌ స్టార్‌ హీరోగా నిలిచి ఇప్పటికి కూడా స్టార్‌ హీరోగానే వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, పొందిన ప్రశంసలు అతి కొద్ది మందికే సాధ్యం అయ్యాయి అన్న‌ది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: