డిసెంబర్ 22, 2006వ సంవత్సరంలో విడుదలైన రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా చార్మి, సుహాసిని, కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్, షియాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. రాధాకృష్ణ కథను అందించగా... కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా... దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు అందించాడు. రాఖీ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే... రామకృష్ణ(తారక్) అనే ఓ యువకుడు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాలని అనుకుంటాడు. తన తండ్రి, చెల్లెలు అంటే రామకృష్ణ కి ఎంతో ఇష్టం. తన చెల్లిని తల్లిగా భావించి ఆమెను ఎంతో ఆప్యాయత తో బాగా చూసుకుంటాడు రామకృష్ణ. తన చెల్లిని ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 


కానీ అదనపు కట్నం కోసం తన చెల్లిని అత్తామామలు బాగా హింసించి బతికుండగానే కాల్చి చంపేస్తారు. ఇది తెలుసుకున్న రామకృష్ణ వారితో పాటు ఆడవారిని హింసించే ప్రతి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. మహిళలపై అన్యాయాలు అరాచకాలకు పాల్పడే ప్రజలపై తాను ప్రతీకారం ఎలా తీసుకుంటాడు అనేది సినిమాలో చాలా చక్కగా చూపించబడింది. ముఖ్యంగా నాయస్థానం సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అందర్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 


రామకృష్ణ పాత్రలో నటించిన జూ. ఎన్టీఆర్ నటనా చాతుర్యం తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో తారక్ నటనకు నిల్చొని హాట్సాఫ్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. హీరోయిన్ గా ఇలియానా, రామకృష్ణ(తారక్)కి మరదలుగా ఛార్మి కౌర్, చెల్లెలిగా మంజూష తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సినిమా ఫస్టాఫ్ ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించగా... సెకండాఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ సృష్టించే నరమేధం ప్రేక్షకులని తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనను తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: