ఎమ్ ఎస్ ధోనీ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో మరిచిపోలేని ముద్ర వేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం సినీ ప్రేక్షకులనే ప్రతీ ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎమ్ ఎస్ ధోనీ,  చిచోరే వంటి సూపర్ సక్సెస్ లని ఇచ్చిన సుశాంత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో నెపోటిజం తెర మీదకి వచ్చింది. వారసత్వం వల్లే సుశాంత్ కి సినిమా అవకాశాలు తగ్గాయని, అందువల్లే డిప్రెషన్ కి గురై ఇలా చేసుకున్నాడని బాలీవుడ్ లోని కొంతమంది సెలెబ్రిటీలు ఆరోపిస్తున్నారు.

 

ఈ విషయమై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఒక్కరే కాదు చాలా మంది సెలెబ్రిటీలు ఈ విషయమై నోరువిప్పి బాలీవుడ్ వారసత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమ అవకాశాలని తన్నుకుపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వారసత్వం గురించి మాట్లాడిన ఆయన, సుశాంత్ సింగ్ చాలా సక్సెస్ ఫుల్ హీరో. అలాంటి హీరో స్థాయి వరకూ చేరుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

 


వారసత్వం అనేది అంతటా ఉంది. రాజకీయాల్లో, వ్యాపారాల్లో, అలాగే సినిమాల్లో. వారసత్వాన్ని కాదనలేం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ ఒకేలాంటి వారే కదా, వారే ఒక ఇరవై ఏళ్లయ్యాక తమ కొడుకులని తీసుకు వస్తున్నారని, ఇప్పుడు వారసత్వంపై స్పీచులు ఇస్తున్న వారు మరో ఇరవై ఏళ్లయ్యాక వారి కొడుకులని, కూతుళ్లని తీసుకురారా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో కరణ్ జోహార్ ని తప్పు పట్టడం సరికాదని అన్నాడు.

 

బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వారసత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే, రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెపోటిజంపై విమర్శలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి. వారసత్వంపై మరింత మంది తమ నోరు విప్పేలా కనబడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: