తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ప్రారంభంలో చిన్న చిన్న విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌తో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్‌, ఎస్వీఆర్ లాంటి మేటి నటులకు దీటుగా నిలిచారాయన. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర అయినా మోహన్ బాబు చేస్తే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం.

 

 

నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా... హీరోగా... విలన్ గా... కమెడియన్ గా... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం మోహన్ బాబు ప్రత్యేకత.తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే మోహన్ బాబే కొట్టాలి.. ఇదీ ఆయన రేంజ్. నటుడిగా తొలి నుంచి మోహన్ బాబు రూటు సెపరేటే అని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే విలనిజం, మేనరిజం, హీరోయిజాన్ని కలబోసుకున్న విలక్షణమైన నటన మోహన్ బాబు సొంతం. 

 

 

ఐతే ఇంత మంచి నటుడిని ఈ తరం దర్శకులు ఉపయోగించుకోకపోవడం విచారించాల్సిన విషయమే. మోహన్ బాబును ఎవరూ అడగట్లేదా.. ఆయనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ.. తెలుగు పరిశ్రమ ఒక మంచి నటుడిని దూరం చేసుకుంటున్న మాట మాత్రం వాస్తవం. గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు చాలా తక్కువ సినిమాలే చేశారు. అవి కూడా సొంత సంస్థలో, అంతగా విషయం లేనివే.

 

 

మోహన్ బాబు కన్నింగ్ విలన్, కామెడీ విలన్ వేషాలను ఎక్కువగా వేశారు. తొంభై దశకం ప్రారంభంలో ‘అల్లుడుగారు’ వంటి చిత్రాలతో హీరో కేరెక్టర్లకు షిఫ్టయ్యారు. అక్కడి నుంచీ ఆయన ఓ పది సినిమాల్లో మాములు కేరెక్టర్ వేస్తే.. ఓ సినిమా హీరోగా చేసేవారు.మోహన్ బాబు హీరోగా నటించిన అసెంబ్లీ రౌడీ పెద్ద హిట్. అక్కడి నుంచి కలెక్షన్ కింగ్ అన్న పేరొచ్చింది. రౌడీగారి పెళ్లాం, అల్లరి మొగుడు, బ్రహ్మ, సిల్వర్ జూబ్లీ హిట్స్ తో ఆ పేరు స్థిరపడిపోయింది.‘యమదొంగ’ వంటి సినిమాల్లో మళ్లీ కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకుండు. మహానటిలో ఎస్వీఆర్ పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: