టాలీవుడ్ సీనియర్ హీరో అయిన జగపతిబాబు సినిమాల్లో విలన్ గా నటిస్తాడని ఎవరు ఊహించి ఉండరేమో. 1992 నుండి దాదాపు పదిహేను- ఇరవై సంవత్సరాలు వరకు తెలుగు పరిశ్రమలో హీరోగా కొనసాగిన జగపతి బాబు 2014వ సంవత్సరంలో లెజెండ్ సినిమా లో ప్రతినాయకుడిగా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి అతడు కథానాయకుడి కంటే ప్రతినాయకుడిగానే బాగున్నాడని అప్పట్లో ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు కూడా జగపతి బాబు విలనిజాన్ని తెగ ప్రశంసించారు. 


ఒకానొక సందర్భంలో తానే స్వయంగా మాట్లాడుతూ... నేను ఎన్నో పాజిటివ్ పాత్రలలో నటించాను కానీ ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు రెండు నెగటివ్ పాత్రలలో నటించేసరికి నాకు ఇంత పెద్ద పేరు వచ్చిందని తెగ ఆశ్చర్యపోతూ చెప్పుకొచ్చాడు. నిజానికి జగపతి బాబుకి హీరో అవకాశాలు ఎప్పుడో సన్నగిల్లిపోయాయి. సినిమాల్లో నటించాలని ఎంతో ఆసక్తి ఉన్నా... అతడిని ఏ మంచి పాత్ర వరించలేదు. అప్పటికే ఎన్నో ఏళ్ల పాటు సినీ అవకాశాల కోసం వేచిచూసి చూసి బాగా విసిగిపోయిన జగపతి బాబు చివరికి విలన్ గా నటించే అవకాశం వచ్చినా కాదనలేక నటించేందుకు సిద్దమయ్యాడు. ఆ విధంగా రిస్క్ చేసి సూపర్ క్రేజ్ ని సంపాదించిన అతనికి రంగస్థలం, లింగ, పిల్లా నువ్వు లేని జీవితం, జయ జానకి నాయక వంటి ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా నటించే అవకాశాలు దన్నుకొచ్చాయి. 


ఏది ఏమైనా నటుడిగా కనుమరుగవుతున్న జగపతిబాబు ఎవరూ ఊహించలేని స్థాయిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. గతంలోనూ అంతఃపురం సినిమాలో రెండు పెగ్గుల మందు తాగి మరీ అతిధి పాత్రలో కనిపించి అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చాడు జగపతిబాబు. ఆ సినిమాలో ఆ అతిథి పాత్ర అనేది నెగిటివ్ షేడ్స్ ఉన్నదే అయినా జగపతి బాబు మాత్రం అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీన్నిబట్టి అప్పట్లోనే తాను నెగెటివ్ క్యారెక్టర్ లలో బాగా ఒదిగిపోగలడని నిరూపితమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: