ఆగస్టు 22, 1997 సంవత్సరంలో విడుదలైన గోకులంలో సీత సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని అత్యంత దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం లభించిందని చెబుతున్నారు ముత్యాల సుబ్బయ్య. కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతను పవన్ కళ్యాణ్ గురించి కొన్ని గొప్ప రహస్యాలను చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 


ఆయన మాట్లాడుతూ... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించిన పవన్ కళ్యాణ్ తదనంతరం నా దర్శకత్వంలో తెరకెక్కించిన గోకులంలో సీత సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో కథానాయకుడికి ప్రేమ అంటే ఒక చులకన భావం ఉంటుంది. అమ్మాయిలు కూడా మనుషులే అని చూసే మనస్తత్వం అతనికి ఉండదు. కానీ చివరి లో మాత్రం ప్రేమ, అమ్మాయిలపై అతనికి చాలా గౌరవం వస్తుంది. ఇటువంటి కథానాయకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించారు. నిజానికి ఆయన చాలా కష్టపడ్డారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు అయినప్పటికీ... సినిమా సెట్స్ లో ఏమాత్రం గర్వం, అహంకారం అతను చూపించలేదు. చిత్రీకరణ సమయంలో విరామం దొరికినప్పుడు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఏదో ఒక బుక్ చదివేవారు'


'అతని పక్కన వెళ్లి కూర్చొని ఓ పది నిమిషాల పాటు సమయాన్ని గడిపితే చాలు ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చెప్పేవారు. అతను చెప్పే విషయాలు వింటే వెంటనే మనం ఫిదా అయిపోవాల్సిందే. ఎవరెవరో నోరు తిరగని పేర్లు కలిగిన రచయితలు రాసిన పుస్తకాల్లోని విషయాలను అతడు చెప్పేవారు. అప్పుడే అతనిలో ఏవేవో మంచి పనులు చేయాలన్న తపన ఉందని నాకు అర్థం అయింది. అతను నాలుగు ఐదు భాషలు కూడా అనర్గళంగా మాట్లాడేవారు. ఇలాంటి గొప్ప మనస్తత్వం, నటనా చాతుర్యం, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ కమర్షియల్ హీరోగా ఎలా ఎదుగుతారన్న డౌట్ నాకు ఉండేది. కానీ అతడు మాత్రం తెలుగు పరిశ్రమలో అతి గొప్ప హీరో గా ఎదిగి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు', అని ముత్యాల సుబ్బయ్య పవన్ కళ్యాణ్ గురించి గొప్ప రహస్యాలను తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: