2010 ఫిబ్రవరి 19వ తేదీన విడుదలైన లీడర్ సినిమా లో తొలిసారిగా రానా దగ్గుబాటి నటించాడు. రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్,  కోట శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు సమకూర్చడంతో పాటు తానే దర్శకత్వం కూడా వహించాడు. లీడర్ సినిమా కథ గురించి తెలుసుకుంటే... ఒక బాంబు పేలుళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సంజీవయ్య(సుమన్) హత్య చేయబడతాడు. దీంతో సంజీవయ్య బంధువైన ధనుంజయ్(సుబ్బరాజు) ఖాళీ అయిన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని సర్వశక్తులు ప్రయత్నిస్తుంటాడు. దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్( రానా దగ్గుబాటి) తన తెలివితేటలతో అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. 

IHG
అయితే తన తండ్రి మరణించాడన్న వార్త విని తన స్వస్థలానికి వచ్చి రాజకీయ విషయాలపై పట్టు సాధిస్తాడు. ఆసమయంలోనే తన తండ్రి చాలా అవినీతిపరుడని అర్జున్ ప్రసాద్ తెలుసుకుంటాడు. దాంతో రాజకీయ వ్యవస్థలో ఎటువంటి అవినీతి చోటు చేసుకోకూడదని బలంగా కోరుకొని ధనుంజయ్ ని తన తెలివితో పక్కకు నెట్టేసి తానే ముఖ్యమంత్రి అయ్యి అవినీతి వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేసి బెస్ట్ సీఎం గా పేరు పొందుతాడు. ఈ సినిమాలో అర్జున్ ప్రసాద్ అవినీతిరహిత రాజకీయ వ్యవస్థను ఎలా నిర్మిస్తాడు? తదనంతరం రాష్ట్రం ఎలా ఉండబోతుందని శేఖర్ కమ్ముల చాలా చక్కగా చూపించాడు. 


అయితే ఈ కథలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవినీతిపరుడే అని చూపించడం నమ్మడానికి కాస్త కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రేమ పేరుతో వేరొక హీరోయిన్ ని మోసం చేయాలని హీరో చేసే ప్రయత్నాలు కూడా నమ్మడానికి కాస్త కష్టంగానే అనిపించాయి. సినిమా సెకండాఫ్ మొత్తం కేవలం ఒక లక్ష కోట్ల రూపాయల నిధులను కాపాడుకోవడమే ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మంచి సన్నివేశాలను కూడా ప్రేక్షకులకు నచ్చేలా శేఖర్ కమ్ముల రూపొందించలేకపోయాడు. 


ఈ సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించిన నూతన నటుడు రానా దగ్గుబాటి అద్భుతమైన నటన ప్రదర్శన చేశాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అతడి వాయిస్ కూడా ప్రేక్షకులను బాగా ఫిదా చేసేసింది. అర్జున్ ప్రసాద్ అంకుల్ పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు కూడా అద్భుతంగా నటించి తనలో ఇంకా నటించే సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు. ప్రతినాయకుడి పాత్రలో నటించిన సుబ్బరాజు కూడా నటనా చాతుర్యంతో ఇరగదీసాడని చెప్పుకోవచ్చు. రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ పాత్రలో చిన్నవే అయినప్పటికీ వారు బాగానే నటించి ప్రేక్షకులను అలరించారు. ఏదేమైనా అందర్నీ ఆశ్చర్యపరుచుతూ పొలిటికల్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల లీడర్ సినిమాని ఒకసారి చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: