టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోలకి పొగరెక్కువ. హీరోయిన్లకి అందంతో పాటు పాత్ర పరిధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ పూరి తీసిన సినిమాలన్నీ దాదాపుగా హీరో క్యారెక్టరైజేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మొదటి సినిమా నుండి మొదలు పెడితే ఇప్పటి వరకూ జ్యోతిలక్ష్మీ మినహాయిస్తే అన్నీ అలాంటి చిత్రాలే తీసారు.

 

బిజినెస్ మేన్ చిత్రం హీరో తాలూకు ఎలివేషన్స్ కి పరాకాష్టగా నిలిచింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో మాటలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే పూరి, తన హీరోల చేత కూడా అలానే చెప్పిస్తాడు. అయితే ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాల మేకింగ్ బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాని తెరపైకి తీసుకువచ్చాడు.

 

అప్పుడెప్పుడో మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కించాలని అనుకున్న పూరి, వర్కౌట్ అవక ఊరుకున్నాడు. తాను రాసుకున్న జనగణమన స్క్రిప్టులోని డైలాగుని కూడా మనకి వినిపించాడు. అయితే తాజాగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించిన పూరి మరికొద్ది రోజుల్లో తెరకెక్కిస్తానని అంటున్నాడు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. జనగణమన ఏ హీరోతో తెరకెక్కిస్తాడనేది సస్పెన్స్ గా మారింది.

 

అయితే జనగణమన అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో హీరో ఆర్మీ జవానుగా కనిపిస్తాడని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో పూరి జగన్నాథ్ చెప్తేనే కానీ బయటకి రాదు. ప్రస్తుతానికి పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: