కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. గతంలో ఎన్నడూ మానవాళి చూడని విధంగా ప్రతీ ఒక్కరిపై దీని ప్రభావం గట్టిగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకీ కూడా తీరని నష్టం కలిగింది. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతబడిపోవడంతో వినోదం కోసం జనాలందరూ ఓటీటీ బాట పడ్డారు.

 

ఓవర్ ద టాప్ పై సినిమాల్ని, వెబ్ సిరీస్ లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంటో ఓటీటీలకి సబ్ స్క్రయిబర్స్ పెరిగారు. అయితే ఓటీటీ యాజమాన్యాలు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులని ఎంజేజ్ చేయడానికి చిన్న సినిమా నిర్మాతలకి మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. అయితే అదేంటో గానీ ఈ సినిమాలన్నింటికీ ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు.

 

తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగల్ వంధాల్, హిందీలో గులాబో సితాబో చిత్రాలకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో ఓటీటీలు ఫ్లాప్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాయన్న టాక్ బాగా వినబడింది. సరిగ్గా ఆడవని అనుకున్న చిత్రాలని అయినకాడికి అమ్మేసి చేతులు దులిపేసుకుందాం అన్న ధోరణీలోనే నిర్మాతలు ఉన్నారని, అందుకే ఓటీటీలో పేలవమైన చిత్రాలు వస్తున్నాయని విమర్శించారు. 

 

దీంతో ఓటీటీకి కూడా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన క్రిష్ణ అండ్ హిస్ లీల అనే చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి క్షణం దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. ఇద్దరు అమ్మాయిలని ప్రేమించే ఒక అబ్బాయి ఎలాంటి కన్ఫ్యూజన్ కి లోనయ్యాడనేది చాలా చక్కగా చూపించారని అంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఓటీటీకీ మొదటి హిట్ పడినట్టే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: