జూన్ 23, 2006వ సంవత్సరంలో విడుదలైన విక్రమార్కుడు సినిమాకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. రవితేజ, అనుష్క శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో రవితేజ అత్తిలి సత్తిబాబు అనే చిన్నపాటి దొంగ పాత్రలో, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రలో కూడా నటించి అద్భుతమైన నటనా చాతుర్యాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. బ్రహ్మానందంతో కలిసి రవితేజ నటించే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. 


సినిమా కథ గురించి తెలుసుకుంటే అత్తిలి సత్తిబాబు నీరజా గోస్వామి( అనుష్క శెట్టి) పై మనసు పారేసుకుని ఆమెకు తాను దొంగ అని చెప్పేస్తాడు. దీంతో అతడి నిజాయితీని ఫిదా అయిపోయిన నీరజా అతడిని ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే విక్రమ్ సింగ్ రాథోడ్ కుమార్తె నేహా(బేబీ నేహా) అత్తిలి సత్తిబాబు వద్దకు వస్తుంది. అచ్చం తన తండ్రి పోలికలతోనే అత్తిలి సత్తిబాబు కనిపించడంతో ఆమె నాన్న నాన్న అని అతడుని పిలుస్తుంది. కానీ అత్తిలి సత్తిబాబు మాత్రం ఆమె ని కూతురుగా అంగీకరించడు. ఒకానొక సమయంలో నేహా కి ఇష్టమైన అమ్మ పాట వినిపించే వాక్ మ్యాన్ ని పగుల గొడతాడు అత్తిలి సత్తిబాబు. అది తెలుసుకున్న నేహా ఎక్కెక్కి ఏడుస్తుంది. అప్పుడు అత్తిలి సత్తిబాబు నిద్రలేచి పగలగొట్టిన వాక్ మ్యాన్ ని సరిగ్గా అతికించి మరల పాట వినిపించేలా చేస్తాడు. ఈ సన్నివేశంలో ఎం ఎం కీరవాణి సంగీతం ప్రేక్షకులని బాగా ఏడిపించేసిందని చెప్పవచ్చు.


మరోవైపు అత్తిలి సత్తిబాబు ని చూసి విక్రమ్ సింగ్ రాథోడ్ అనుకున్న బావూజీ మనుషులు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలోనే అత్తిలి సత్తిబాబు ని కాపాడటానికి విక్రమ్ సింగ్ రాథోడ్ అరంగేట్రం చేస్తాడు. అత్తిలి సత్తిబాబు ప్రాణాలకి తన ప్రాణాలను పణంగా పెట్టి విక్రమ్ సింగ్ రాథోడ్ రౌడీలని ఒంటిచేత్తో మట్టికరిపిస్తాడు. అదేసమయంలో తాను చెప్పే డైలాగులు ప్రేక్షకులను రక్తం మరిగేలా చేశాయి అంటే అతిశయోక్తి కాదు. చావంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నారా రా... రాథోడ్... విక్రమ్ సింగ్ రాథోడ్!!! అని రవితేజ చెప్పే డైలాగులు థియేటర్లలో దుమ్మురేపింది అని చెప్పుకోవచ్చు.


ప్రకాష్ రాజ్ తో చోటుచేసుకున్న సన్నివేశంలో కూడా రవితేజ చెప్పే... 'చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకు ఉండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చేయి నా మీసం మీద ఉండాలి, సార్' డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ డైలాగులు, విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నటన ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులలో బావోద్వేగం రేకెత్తిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా విక్రమార్కుడు సినిమా లో అసలు సిసలైన పోలీస్ గా కనిపించి రవితేజ దుమ్మురేపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: