క్రైం... థ్రిల్లర్‌... సస్పెన్స్‌... ఇంటరాగేషన్‌... ఏమిటీ ఈ పదాలు అంటారా? వెబ్‌ సిరీస్‌లు ఈ నాలుగు పదాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్నాయనిపిస్తోంది. ఏదో నేరం జరుగుతుంది. అది ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? దాని చుట్టూ ఉన్న పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకడమే ఇతివృత్తాలుగా వెబ్‌సిరీస్‌లు పుట్టుకొస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌, జియో, సన్‌నెక్ట్స్‌, ఆహా... ఓటీటీ వేదిక ఏదైనా, ఇవే రాజ్యమేలుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగానే ఎక్కువగా ఈ కథలు రూపొందుతున్నాయి. కొన్ని వ్యవస్థల కేంద్రంగా నడుస్తుంటే, మరికొన్ని వ్యక్తులు, ప్రాంతాల చుట్టూ అల్లుకుంటున్నారు కథకులు.

 

 

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'నార్కోస్‌' వెబ్‌సిరీస్‌ ఇలాంటి నేపథ్యాలకు జోరందించిందని చెప్పుకోవచ్చు. కొలంబియా నుంచి అమెరికాకు విస్తరించిన డ్రగ్‌ మాఫియా, వారి వ్యవహారాలు, నేరాల తీరు, పోలీసుల నేర పరిశోధన ఇతివృత్తంగా నడుస్తుందీ కథ. సహజత్వం, నిజపాత్రలను పోలిన నటులు దొరకడం ఈ వెబ్‌సిరీస్‌ బృందానికి బలం చేకూర్చాయి. మనం దేశంలోనూ ఇలాంటి కథలను ఓటీటీ వేదికలకు ఎక్కువగా తెరకెక్కాయి. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నవి కొన్నైతే, రెండో సీజన్‌ రూపంలో త్వరలో ప్రసారం కాబోతున్నవి మరికొన్ని.

 

 

తన కుమారుడికి ఊపిరితిత్తులు అమర్చేందుకు తండ్రి ఏం చేస్తాడన్న కథాంశంతో రూపొందింది 'బ్రీత్‌' మొదటి సీజన్‌. దీని రెండో సీజన్‌లో అభిషేక్‌ బచన్‌, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో కూతురు తప్పిపోతుంది. తనను వెతకడానికి తండ్రి ఎలా శ్రమిస్తాడన్న నేపథ్యంతో 'బ్రీత్‌' సీజన్‌ 2 ట్రైలర్‌ కనిపిస్తోంది. జులై 10న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


అసంతృప్తితో ఉన్న ఓ పోలీస్‌కు ఓ హత్యాయత్నం కేసు అప్పగిస్తారు పైఅధికారులు. విచారణలో అతనికి ఈ కేసు వెనక దాగి ఉన్న శక్తులు, మోసాల గురించి తెలుస్తుంది. ఆ తర్వాత అతనేం చేశాడు? అనేది కథాంశమే 'పాతాళ్‌లోక్‌'. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో అలరిస్తోంది. దీనికి హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి: