మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సుల‌కు పెట్టింది పేరు అన్న విష‌యం తెలిసిందే. తెలుగు సినిమా రంగం నుంచి ఎన్టీఆర్ దూర మ‌వుతోన్న వేళ‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు సీనియ‌ర్లు అయిన వేళ యువ కెర‌టంలా దూసుకు వ‌చ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ నాడు చిరు న‌టించిన సినిమాల్లో సాంగ్స్ కు బ్రేక్ డ్యాన్స్ వేస్తుంటే కుర్రాళ్లు వేలం వెర్రెక్కి పోయేవారు. తెలుగు సినిమా రంగంలో డ్యాన్స్ అనే దానికి ఓ క్రేజ్ తీసుకు వ‌చ్చింది ఖ‌చ్చితంగా చిరంజీవే అని చెప్పాలి. బాడీని స్ప్రింగ్ లా ఊపుతూ చిరు వేసే డ్యాన్సులు ఆ త‌ర్వాత ఎంతో మంది హీరోల‌కు, యువ‌కుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచాయి.

 

ఇక చిరు ఎన్నో సినిమాల్లో ఎన్నో స్టెప్పులు వేశాడు. అయితే వీటిన్నింటి కంటే ఇంద్ర సినిమాలో దాయి దాయి దామా.. కులికే కుంద‌నాల బొమ్మ అనే సాంగ్‌లో వేసిన వీణ స్టెప్ చ‌రిత్ర‌లోనే నిలిచి పోయింది. 2002 లో చిరు కెరీర్ సంక‌ట స్థితిలో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మించారు. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. సోనాలి బింద్రే, ఆర్తీ అగ‌ర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

 

ఈ సినిమాలో ఫ‌స్టాఫ్‌లో సోనాలి బింద్రేతో వ‌చ్చే దాయి దాయి దామా సాంగ్‌లో చిరు వేసిన వీణ స్టెప్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించేసింది. ఈ సినిమా బ్లాక్ బస్ట‌ర్ హిట్ అవ్వ‌గా ఇందులో ఈ స్టెప్ పాత్ర చాలా ఉంది. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర్చిన బీట్‌కు అనుగుణంగా లారెన్స్ చిరుతో అదిరిపోయే స్టెప్ వేయించి.. ఈ పాట‌ను ఓ మ‌ర‌పురాని మ‌ధురానుభూతిగా చ‌రిత్ర‌లో నిలిచి పోయేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: