కరోనా కాటేసింది..!  సినిమాకు తెర పడి వంద రోజులైంది. థియేటర్లు మూతపడ్డాయ్‌. ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పలేని పరిస్థితి. ఇదే కొనసాగితే శాశ్వతంగా హాళ్లు మూసేయాల్సిందేనని అంటున్నారు ఓనర్లు. 
జనానికి ఎంటర్టైన్‌మెంట్‌ కావాలంటే ముందుగా కోరుకునేది మూవీనే..! కనీసం వారానికి కాకపోయినా... నెలకోసారైనా థియేటర్‌కు వెళ్లి మూవీ చూసేవారు చాలామంది ఉంటారు. ఇళ్లలో టీవీలు ఉన్నా... సకుటుంబ సమేతంగా సినిమాహాల్‌కు వెళ్తే ఆ ఆనందమే వేరు. 

 

అయితే మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు వందరోజులు దాటినా ఇంకా తెరుచుకోలేదు.  విశాఖ జిల్లావ్యాప్తంగా 150 థియేటర్లు ఉన్నాయి. మార్కెట్లో  పోటీ పెరగడంతో  ప్రేక్షకులను ఆకర్షించేందుకు అన్ని థియేటర్లను రీమాడల్‌ చేశారు. అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు.  ఇందుకోసం యజమాన్యాలు భారీగా ఖర్చు చేశాయి.  ఇక కరెంట్ బిల్లులు, సిబ్బంది శాలరీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద నెలకు  5 నుండి 6 లక్షలు అవుతోంది.  సాధారణ రోజుల్లో ఇంత పెద్దమొత్తం ఆదాయం రాకున్నా పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో వచ్చే అధికాదాయంతో ఇన్నాళ్లూ  నెట్టుకు వచ్చేవారు. కానీ లాక్‌డౌన్‌తో పరిస్థితి తారుమారైంది. 

 

ఇప్పటివరకు హిట్ సినిమాలు వంద, నూటా యాభై రోజులు ఆడడం విన్నాం. ఇప్పుడు చూస్తే లాక్‌డౌన్‌తో హాళ్లు మూతపడి వంద రోజులు దాటిందని చెప్పుకోవాల్సి వస్తోంది. విశాఖ జిల్లాలో సినిమా థియేటర్లపై ఆధారపడి ప్రత్యక్షంగా రెండు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రస్తుతం వీరికి ఉపాధి లేకుండా పోయింది. నిర్వాహకులు సగం జీతమే ఇస్తుండడంతో అప్పులు చేసి సంసారాలు నెట్టుకొస్తున్నారు. 

 

నిబంధనలు సడలించాక...  మద్యం దుకాణాలు, హోటళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం ధియేటర్లను పక్కకు నెట్టేయడం అన్యాయమని అంటున్నారు డిస్టిబ్యూటర్లు. హాళ్లలో సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేస్తామని...  ఇదే కొనసాగితే శాశ్వతంగా మూతపడడం ఖాయమని బాధపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఇదే జరిగితే మరింత నష్టపోక తప్పదన్న భయం నిర్వాహకుల్ని వెంటాడుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: