మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ఎదో ఒకటి నేర్చుకోవచ్చు ఒకవిధంగా ప్రకృతికి మించిన గురువు లేదు. ఆ ప్రకృతిలోనే పరబ్రహ్మ స్వరూపం దాగి ఉంది. అందుకే భారతీయ తత్వ చింతనలో గురువుకు ప్రకృతికి అమితమైన ప్రాముఖ్యత ఉంటుంది. గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

 

ఏకరాశి గా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా చేసిన మహనీయుడు వ్యాసుడు. ఆ వేదవ్యాసుడు పుట్టినరోజునే మనం గురుపూర్ణిమ గా జరుపుకుంటాం. రుగ్వేదం – యజుర్వేదం – సామవేదం - అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా వ్యాసుడు విభజించాడు. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు బౌద్ధులు జైనులు కూడా పర్వదినంగా పాటిస్తారు. గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉన్నట్లుగా అనేక ఆధారాలు ఉన్నాయి. పూర్వకాలంలో గురువులు తమ శిష్యులకు కేవలం వేదాలు ఉపనిషత్తులు ఆధ్యాత్మిక యోగ విద్యలు మాత్రమే కాకుండా ఆనాటి గురువులు అస్త్ర శస్త్ర విద్యలు ఆయుర్వేద గణిత జ్యోతిష వాస్తు శాస్త్రాలు  సంగీతం వంటి విద్యలను కూడా నేర్పేవారు.

 

హిందూ మతంలోని అద్వైత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయాలలో బౌద్ధ జైన మతాలలో గురుశిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉంది. గురువు అనే మహోన్నత వ్యక్తి తన శిష్యులలో అంధకారాన్ని పారద్రోలి వారిని జ్ఞానమార్గంలో ముందుకు నడిపిస్తాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ గురు పూర్ణమి రోజున శ్రీ షిరిడీ ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక గురువులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు తమ తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రబోధించి భిన్న మతాలను స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని క్రీస్తుపూర్వమే స్థాపించారు. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు మన హిందూ మతానికి సంబంధించి మతాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు.

 

ఆధునిక యుగంలో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. గురు శిష్య సంబంధానికి ప్రతీకలు గా రామకృష్ణ పరమహంస స్వామీ వివేకానంద ల సాన్నిహిత్యాన్ని మరిచిపోరాదు. గురుపూర్ణిమ రోజున వ్యాసుని మొదలుకొని గురు పరంపరను స్మరించుకుని పూజించడం ఆచారంగా వస్తోంది. మన దేశంలో కొన్ని విద్యాసంస్థల్లో కూడా గురుపూర్ణిమ వేడుకలు జరుగుతాయి. ఇలాంటి పరమపవిత్రమైన గురుపూర్ణిమ ప్రాముఖ్యత నేడు బాగా తగ్గిపోతోంది. ప్రస్తుతం గురు శిష్య సంబంధాలు కూడ ఆర్ధిక బంధాలుగా మారిపోయిన పరిస్థితులలో గురువు ఒక వ్యాపారిగా మారిపోతున్నాడు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ గురువును స్మరించుకునే గురుపూర్ణిమ పర్వదినాన్న ప్రతి ఒక్కరు తమ గురువును స్మరించుకోవడం మన కనీస ధర్మం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: