ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వై.వి.ఎస్.చౌదరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `దేవదాసు` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు రామ్ . ఈ చిత్రంతో రామ్ స‌ర‌స‌న‌ ఇలియానా హీరోయిన్‌గా న‌టించింది. ఇలియానాకు కూడా ఇదే మొద‌టి సినిమా కావ‌డం మ‌రో విశేషం. అయితే వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది.

 

ఆ త‌ర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం చిత్రంలో న‌టించాడు రామ్‌. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేక‌పోయింది. కానీ, రామ్ న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత  రెడీ,  మస్కా, గణేష్,  రామ రామ కృష్ణ కృష్ణ,  కందిరీగ, ఎందుకంటే...ప్రేమంట!,  ఒంగోలు గిత్త,  పండగ చేస్కో, నేను శైలజ, హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఇక ఇటీవ‌ల వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో రామ్ స్టార్ హీరో అయిపోయారు. రామ్ పోతినేని అనే కంటే ఇస్మార్ట్ రామ్ లేదా ఇస్మార్ట్ శంకర్ అంటే అందరూ టక్కున గుర్తు పట్టేస్తారు. అంత‌లా రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. అంతేకాదు ఎనర్జీకి మారుపేరుగా రామ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

రామ్ లో చురుకుదనం, నటనలో అతని వేగం, టైమింగ్ ఎవ్వరికైనా నచ్చేస్తాయి. అంతేకాదు ఈతరం యువతకు అతను ఓ రోల్ మోడల్ లా కనిపిస్తుంటాడు. ఇక ఈ రామ్ పోతినేని ఎవ‌రో కాదు..  నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా రామ్ మాత్రం ఈ స్థాయికి చేరుకోవ‌డానికి ఆయ‌న కృషి, ప‌ట్టుద‌లే కార‌ణ‌మ‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం రామ్ `రెడ్` సినిమాలో న‌టిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: