కన్నడ టీవీ ఇండస్ట్రీలో కొంత కాలం పని చేసి ఆ తర్వాత డ్యూయెట్ అనే ఒక తమిళ సినిమాలో మొట్టమొదటిగా నటించిన ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషా చిత్రాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు పొందాడు. మాతృభాష కన్నడ అయినప్పటికీ... అతను తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అందుకే అతనికి సినీ అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. తన సినీ కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ సంధ్య పాత్రలో నటించిన దేవయాని కి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ సినిమాలో ఇన్ స్పెక్టర్ వాసుదేవరావుగా ప్రకాష్ రాజ్ కనిపించి అందర్నీ ఫిదా చేసేసాడు.


నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ అతడు చెప్పే డైలాగు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తుంది. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ఆర్తి అగర్వాల్ కి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ సినిమాలో వెంకటేష్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. 2002వ సంవత్సరంలో విడుదలైన ఇడియట్ సినిమాలో రవితేజ, రక్షిత, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించగా... రవితేజ చంటి పాత్రలో ఒదిగిపోగా రక్షిత సుచిత్ర గా... సుచిత్ర తండ్రి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ సినిమాలో నటించినందుకు ప్రకాష్ రాజ్ కి రవితేజ తో సరి సమానంగా గుర్తింపు లభించింది.


ఇలా చెప్పుకుంటూపోతే గంగోత్రి, దిల్, పరుగు వంటి చిత్రాల్లో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. బొమ్మరిల్లు సినిమా లో హీరోకి తండ్రి పాత్రలో నటించాడు. ఆ తండ్రి పాత్ర ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకి కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే న్యాయం చేయగలడని కూడా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆకాశమంత సినిమాలో త్రిష కి మంచి తండ్రిగా నటించిన ప్రకాష్ రాజు ప్రేక్షకుల మనసులను చూరగొన్నాడు. 1997-2010 వరకు హీరోయిన్లకు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజు 2010 నుండి ఇప్పటివరకు హీరోలకు తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాడు. హిందీ సినిమాల్లో కూడా ప్రకాష్ పెద్ద సినిమాల్లోని కీలకమైన క్యారెక్టర్ లలో నటించేవాడు. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోగల అత్యంత నటనా ప్రతిభ అతనిలో ఉందంటే అతిశయోక్తి కాదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: